క్రికెట్ అభిమానులను అలరించడానికి భారత్-శ్రీలంక టీ20 సిరీస్ సిద్ధమైంది. జులై 27 నుంచి మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. పల్లెకెలె వేదికగా అన్ని మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సిరీస్‌లో టీమిండియానే ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. అయితే కోచ్‌గా గౌతమ్ గంభీర్, టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ బాధ్యతలు అందుకున్న తర్వాత భారత జట్టు ఆడే తొలి సిరీస్ ఇదే కావడంతో లంక పర్యటనపై అంచనాలు పెరిగాయి.
అంతేగాక టీ20ల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత భారత్ తొలిసారిగా పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగడం ఇదే ప్రథమం. ఈ నేపథ్యంలో జట్టు కూర్పు ఎలా ఉంటుందని, వాళ్ల స్థానాలను ఎవరు భర్తీ చేస్తారనే ఆసక్తి మొదలైంది. అయితే శనివారం శ్రీలంకతో జరిగే తొలి టీ20లో భిన్నంగా మరీ అంత భిన్నంగా ట్రై చేయకుండా తుదిజట్టును సిద్ధం చేయాలని గంభీర్-సూర్య భావిస్తున్నారు.

ఓపెనర్లుగా యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నారు. టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లి, రోహిత్ ఓపెనర్లుగా రావడంతో ఈ యువప్లేయర్లకు నిరాశే మిగిలిన విషయం తెలిసిందే. అయితే ఇకపై గిల్-జైస్వాల్ స్థిరమైన ఓపెనర్లుగా జట్టులో కొనసాగనున్నారు. వన్‌డౌన్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రానున్నాడు. నాలుగో స్థానంలో రిషభ్ పంత్ వస్తారు.
అయితే లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కొనసాగించాలనుకుంటే తొలి వికెట్ పడిన బ్యాటర్‌ను బట్టి సూర్య-పంత్ స్థానాలు మార్చుకుంటారు. ఇక గత కొంతకాలంగా సత్తాచాటుతున్నప్పటికీ టీ20 వరల్డ్ కప్‌లో చోటు కోల్పోయిన రింకూ సింగ్ అయిదో స్థానంలో రానున్నాడు. అలాగే శివమ్ దూబె, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్ జట్టు అవసరాలను బట్టి బ్యాటింగ్‌కు రానున్నారు. దూబెతో కనీసం రెండు ఓవర్ల పాటు బౌలింగ్ చేయించేలా ప్రణాళికలు రచించారు.
రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ స్పిన్ బాధ్యతలు చూసుకోనున్నారు. కొత్త బంతిని అర్షదీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ పంచుకోనున్నారు. సంజు శాంసన్‌కు మరోసారి నిరాశే మిగలనుంది. అతనితో పాటు రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, ఖలీల్ అహ్మద్ తొలి టీ20లో బెంచ్‌కే పరిమితం కానున్నారు.
శ్రీలంకతో జరిగే తొలి టీ20కి భారత తుది జట్టు (అంచనా)
శుభ్‌మన్ గిల్, యశస్వీ జైస్వాల్, సూర్యకుమార్ (కెప్టెన్), రిషభ్ పంత్, రింకూ సింగ్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, మహ్మద్ సిరాజ్,
భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, రిషభ్ పంత్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్.