విండీస్‌పై నాలుగో టీ20లో భారీ విజయం సాధించిన టీమిండియా.. చివరిదైన ఐదో టీ20 కోసం రెడీ అవుతోంది. ప్రస్తుతం సిరీసులో ఈ రెండు జట్లు చెరో రెండు విజయాలతో నిలిచాయి. దీంతో ఐదు మ్యాచుల ఈ సిరీసులో చివరి మ్యాచ్ చాలా కీలకంగా మారింది. ఈ మ్యాచ్ గెలిచిన జట్టుకే సిరీస్ దక్కుతుంది.
చివరి రెండు మ్యాచుల్లో ఆధిపత్యం చెలాయించిన టీమిండియా.. మంచి జోరు మీదున్న మాట వాస్తవమే. అయితే చివరి మ్యాచ్ నెగ్గేందుకు ఈ జట్టు ఒక కీలక నిర్ణయం తీసుకునేలా కనిపిస్తోంది. నాలుగో టీ20 జరిగిన లాడర్‌హిల్ మైదానంలోనే చివరి మ్యాచ్ కూడా జరగనుంది. దీంతో మరో భారీ స్కోరింగ్ మ్యాచ్‌ను ప్రేక్షకులు ఆశించవచ్చు.

నాలుగో మ్యాచ్‌లో 177 పరుగుల టార్గెట్‌ను కేవలం ఒకే వికెట్ కోల్పోయి ఛేదించిన టీమిండియా.. కచ్చితంగా చివరి మ్యాచ్‌లో ఫేవరెట్ అని చెప్పాలి. అయితే షిమ్రాన్ హెట్మెయర్ కూడా నాలుగో టీ20లో చెలరేగాడు. అతనికి నికోలస్ పూరన్ వంటి వాళ్లు జత కలిస్తే.. విండీస్‌ను అడ్డుకోవడం కూడా కష్టమే.
అయితే నాలుగో టీ20లో టీమిండియా తరఫున రాణించిన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను మ్యాచ్‌లో పక్కన పెట్టేయాలని టీం మేనేజ్‌మెంట్ ఆలోచిస్తోందట. అతని స్థానంలో కుర్ర ప్లేయర్ రవి బిష్ణోయిని ప్రయోగించాలని ప్లాన్ చేస్తోంది. నాలుగో మ్యాచ్‌లో కుల్దీప్ రెండు కీలక వికెట్లు తీసుకున్నా.. అతన్ని పక్కన పెట్టేస్తారని తెలుస్తోంది. విండీస్ కూడా హోప్‌ను పక్కన పెట్టేయాలని ప్లాన్ చేస్తోంది.

వెస్టిండీస్ జట్టు (అంచనా): బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, జాన్సన్ చార్లెస్, నికోలస్ పూరన్, రావ్‌మెన్ పావెల్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, రొమేరియో షెఫర్డ్, జేసన్ హోల్డర్, అకీల్ హొస్సేన్, అల్జారీ జోసెఫ్, ఓబెడ్ మెకాయ్
భారత జట్టు (అంచనా): యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సంజూ శాంసన్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, ముఖేష్ కుమార్, రవి బిష్ణోయి.