బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టీ20లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు టీ20ల సిరీస్‌లో 1-0తో ఘనంగా బోణీ కొట్టింది. అదే జోరును బుధవారం జరగనున్న రెండో టీ20లోనూ ప్రదర్శించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌కు ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదిక కానుంది.
తొలి టీ20లో భారత ఛేదన మెగాటోర్నీలో భారీ నెట్‌రన్‌రేటు కోసం ఆడినట్లుగా సాగింది. భారత ఆటగాళ్లు పోటాపోటీగా బౌండరీలు సాగిస్తూ మ్యాచ్‌ను ముగించారు. ఈ క్రమంలో టీ20ల్లో 100+ లక్ష్యాన్నిభారత్ త్వరగా ముగించిన మ్యాచ్‌గా అది రికార్డులకెక్కింది. అయితే రెండో టీ20 వేదిక బ్యాటింగ్‌కు మరింత సానుకూలంగా ఉంటుంది. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఢిల్లీలో పరుగుల ప్రవాహం పారింది.

ఈ నేపథ్యంలో రెండో టీ20లో తుదిజట్టు కూర్పు ఎలా ఉంటుందనే ఆసక్తి పెరిగింది. తొలి టీ20 తరహాలో ఆల్‌రౌండర్లకు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్ ప్రాధాన్యత ఇస్తారా? లేదా స్పెషలిస్టు బ్యాటర్లు, బౌలర్లకు అవకాశం ఇస్తారా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు యువ పేసర్ హర్షిత్ రాణాకు తన హోమ్ గ్రౌండ్ ఢిల్లీలో అరంగేట్ర అవకాశం ఇస్తారా? లేదా బెంచ్‌కే పరిమితం చేస్తారా అనే సందేహాలు పెరిగాయి.
అయితే తొలి టీ20లో ఆడిన జట్టుతోనే రెండో టీ20లోనూ బరిలోకి దిగాలని గంభీర్-సూర్య భావిస్తున్నారు. జట్టుకూర్పు మార్పు చేయకుండా సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ, హర్షిత్ రాణా, వికెట్ కీపర్ జితేశ్ శర్మ, స్పిన్నర్ రవిబిష్ణోయ్‌కు నిరాశే మిగలనుంది. తిలక్ వర్మ ఈ ఏడాది ఆరంభంలో జరిగిన అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌లో టీమిండియాకు చివరిగా ప్రాతినిథ్యం వహించాడు.

బంగ్లాదేశ్‌తో రెండో టీ20 ఆడే భారత జట్టు (అంచనా)
సంజు శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రియాన్ పరాగ్, నితీశ్ కుమార్ రెడ్డి, హార్దిక్ పాండ్య, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, మయాంక్ యాదవ్, అర్షదీప్ సింగ్.
భారత జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్య, రింకూ సింగ్, తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేశ్ శర్మ, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్.