
హరారె: భారత క్రికెట్ జట్టు తన జైత్రయాత్రను సాగిస్తోంది. జింబాబ్వే గడ్డపై ఆ దేశ జట్టుతో రెండో వన్డే ఇంటర్నేషనల్‌లో తలపడబోతోంది. మూడు మ్యాచ్‌ల ఈ వన్డే సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే 1-0 తేడాతో ఆధిక్యతను సాధించింది. ఇవ్వాళ్టి మ్యాచ్‌లో కూడా గెలిస్తే- సిరీస్ సొంతమౌతుంది. లేదా ఎల్లుండి జరిగే చివరిదైన మూడో వన్డే వరకు ఎదురు చూడాల్సి వస్తుంది. ఇప్పుడున్న టీమిండియా దూకుడును చూస్తోంటే- గెలుపు లాంఛనప్రాయమే.
కేఎల్ రాహుల్ సారథ్యంలోని టీమిండియా ఈ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం జింబాబ్వేలో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. ఇదివరకు ఇంగ్లాండ్, ఆ తరువాత వెస్టిండీస్ తరువాత వరుసగా ఇది మరో సిరీస్. దీన్ని కూడా కైవసం చేసుకోగలిగితే- విదేశీ గడ్డపై హ్యాట్రిక్ కొట్టినట్టవుతుంది. రెండో వన్డే భారత కాలమానం ప్రకారం.. ఈ మధ్యాహ్నం 12:45 నిమిషాలకు ఆరంభమౌతుంది. హరారె స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్ దీనికి వేదిక కానుంది. సోని స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఈ మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.
తొలి వన్డేలో ఆడిన జట్టులో మార్పులు చేయకపోవచ్చు టీమిండియా. ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో తిరుగులేదనిపించుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టును 189 పరుగులకే కట్టడి చేశారు భారత బౌలర్లు. ఆ స్కోర్‌ను 30.5 ఓవర్లలోనే ఛేదించారు బ్యాటర్లు. ఈ క్రమంలో ఒక్క వికెట్ కూడా నష్టపోలేదు. ఓపెనర్లు శిఖర్ ధావన్-81, శుభ్‌మన్ గిల్-82 పరుగులతో నాటౌట్‌గా క్రీజ్‌లో నిలిచారు. 192 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని అందించారు.
అదే జట్టుతో రెండో వన్డేలోనూ బరిలోకి దిగబోతోంది. తుదిజట్టులో- శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, ఇషాక్ కిషన్, కేఎల్ రాహుల్ (కేప్టెన్), దీపక్ హుడా, సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, దీపక్ చాహర్, కుల్‌దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ ఆడే అవకాశం ఉంది. జింబాబ్వేలో- తడిమనషె మరుమని, ఇన్నోసెంట్ కియా, సీన్ విలియమ్స్, వెస్లె మధెవెరె, సికందర్ రజా, రెజిస్ చకబ్వా (కేప్టెన్-వికెట్ కీపర్), ర్యాన్ బర్ల్, ల్యూక్ జొంగ్వే, బ్రాడ్ ఎవాన్స్, విక్టర్ న్యౌచి, రిచర్డ్ ఎన్‌గరవ ఆడొచ్చు.