లాహోర్: ఇండో - పాక్ సిరీస్ పైన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) ఆశలు వదులుకుంటోంది. దాయాదితో సిరీస్‌పై బీసీసీఐ ఇంకా తన స్పందన తెలపలేదు. ఐతే పిసిబి మాత్రం సిరీస్‌పై నమ్మకం క్రమంగా కోల్పోతోంది. భారత్‌తో సిరీస్‌కు సంబంధించిన అధ్యాయాన్ని ప్రస్తుతానికి ముగిస్తున్నామని పీసీబీ ఛైర్మన్ షహర్యార్ ఖాన్ చెప్పాడు.
నలభై ఎనిమిది గంటల్లోగా సిరీస్‌పై నిర్ణయాన్ని చెప్పాలని షహర్యార్ ఆదివారం బీసీసీఐకి రాసిన లేఖలో పేర్కొన్నాడు. లేదంటే భారత్‌తో ఆడరాదని నిర్ణయిస్తామన్నాడు. సిరీస్ పైన సోమవారం తుది నిర్ణయం తీసుకుంటామని షహర్యార్ వెల్లడించాడు.

శనివారం సాయంత్రం వరకు బీసీసీఐ నుంచి తమకు స్పందన రాలేదని, దీంతో ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిస్తున్నామని, ఈ అంశంపై సోమవారం నాటికి ఓ ప్రకటన చేస్తామని, భారత్‌తో ఆడేందుకు అన్ని ప్రయత్నాలు చేశామని షహర్యార్ ఖాన్ చెప్పాడు.
చివరకు బీసీసీఐ విజ్ఞప్తి మేరకు వేదికను యూఏఈ నుంచి శ్రీలంకకు మార్చామని, కానీ తమ శ్రమకు ఫలితం లేకుండా పోతోందన్నాడు. ఈ విషయాన్ని ఐసీసీ వద్ద లేవనెత్తుతామన్నాడు. మరోవైపు, ద్వైపాక్షిక సిరీస్ జరగకపోయినా భారత్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌ను బహిష్కరించవద్దని పీసీబీకి పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ సూచించాడు.