ముంబై: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బిసిసిఐ) కార్యాలయాన్ని శివసేన కార్యకర్తలు సోమవారం నాడు ముట్టడించారు. కార్యకర్తలు ఆఫీసులోకి చొచ్చుకెళ్లి బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇండో పాక్ సిరీస్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డుతో చర్చలు జరుపుతామని శశాంక్ ప్రకటించడంపై వారు నిరసన తెలిపారు. వందలాది మంది కార్యకర్తలు సోమవారం ఉదయం ఒక్కసారిగా బిసిసిఐ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు. శశాంక్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అక్కడి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోను పాకిస్తాన్‌తో సిరీస్‌కు అంగీకరించబోమని చెప్పారు. శివసేన ఆందోళనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు షహర్యార్ ఖాన్‌ను చర్చల కోసం బిసిసిఐ ఆహ్వానించింది.
శివసేన ఆందోళన నేపథ్యంలో సమావేశం రద్దయినట్లుగా తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి. అయితే, అధికారికంగా వెల్లడించవలసి ఉంది. శివసేన కార్యకర్తలు బిసిసిఐ అధ్యక్షుడిని పాకిస్తాన్ బోర్డుతో చర్చలు జరపడాన్ని కార్యాలయం లోపలకు వెళ్లి నిలదీశారు.