టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన సూపర్-4 మ్యాచులో అజేయ శతకంతో రాణించాడు. ఇది కొలంబోలో కోహ్లీకి వరుసగా నాలుగో అంతర్జాతీయ శతకం కావడం గమనార్హం. సోమవారం నాటి ఇన్నింగ్స్‌తో ఒక స్టేడియంలో వరుసగా అత్యధిక శతకాలు బాదిన రికార్డును కోహ్లీ సమం చేశాడు.
అయితే మంగళవారం నాడు భారత్, శ్రీలంక మధ్య మరో మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ క్రమంలో తను పాక్‌తో మ్యాచ్ ఆడుతున్నంత సేపూ అదే ఆలోచనలో ఉన్నానని కోహ్లీ చెప్పాడు. మరో 24 గంటలు కూడా గడవకముందే మరో మ్యాచ్ ఆడాలనే ఆలోచన తన మదిలో మెదులుతూనే ఉందని కోహ్లీ అన్నాడు.

ఆదివారం నాడు వర్షం పడటంతో భారత్, పాక్ మ్యాచ్ ఆగిపోయింది. దీంతో ఈ మ్యాచ్‌ను రిజర్వ్ డేకు వాయిదా వేశారు. ఈ క్రమంలో 147/2 స్కోరుతో సోమవారం ఇన్నింగ్స్ మొదలు పెట్టిన విరాట్ కోహ్లీ (122 నాటౌట్), కేఎల్ రాహుల్ (111 నాటౌట్) ఇద్దరూ అదరగొట్టారు. వీళ్లిద్దరూ చెలరేగడంతో భారత జట్టు 356/2 పరుగుల భారీ స్కోరు చేసింది.
లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ కేవలం 128 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో సెంచరీతో వన్డేల్లో అత్యంత వేగంగా 13 వేల పరుగులు పూర్తి చేసిన క్రికెటర్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఇది కోహ్లీ కెరీర్‌లో 47వ వన్డే సెంచరీ. ఈ సెంచరీలో కోహ్లీ కేవలం 9 ఫోర్లు, మూడు సిక్సర్లు మాత్రమే బాదాడు. మిగతా రన్స్ అన్నీ సింగిల్స్, డబుల్స్ మాత్రమే తీశాడీ మోడ్రన్ లెజెండ్.
ఈ సెంచరీ గురించి మాట్లాడిన కోహ్లీ.. 'నేను ఆ రన్స్ కోసం చాలా హ్యాపీ ఫీలయ్యా. కానీ అరే.. రేపు 3 గంటలకు మళ్లీ మ్యాచ్ ఆడాలి అని ఆలోచిస్తూనే ఉన్నా. అయితే మేం టెస్టు ప్లేయర్లం. నేను వంద టెస్టులకుపైగా ఆడా. కాబట్టి మరుసటి రోజే వచ్చి ఆడటం ఎలాగో నాకు తెలుసు. ఇక్కడ వాతావరణం చాలా తేమగా ఉంది. నాకు నవంబరులో 35 ఏళ్లు వస్తాయి. కాబట్టి రికవరీపై కూడా ఫోకస్ పెట్టాలి' అని చెప్పుకొచ్చాడు.
అంతేకాదు, మ్యాచ్ అనంతరం తనను ఇంటర్వ్యూ చేస్తున్న మంజ్రేకర్‌తో అలిసిపోయానంటూ కోహ్లీ జోకులు పేల్చాడు. 'నేను బాగా టైర్ అయిపోయా. ఈ ఇంటర్వ్యూను త్వరగా ముగించాలని నిన్ను అడుగుదాం అనుకున్నా' అని చెప్పాడు. కోహ్లీ చేసిన 122 పరుగుల్లో 68 రన్స్ కేవలం పరిగెత్తి సాధించినవే కావడం గమనార్హం.
స్ట్రైక్ రొటేట్ చేయడమే తన పని అని, ఆ విషయంలో చాలా గర్వపడతానని కోహ్లీ అన్నాడు. 'జట్టుకు రకరకాలుగా హెల్ప్ చేయడానికి నేను ఎప్పుడూ ప్రిపేర్ అయ్యి ఉంటా. కేఎల్ రాహుల్ తన ఇన్నింగ్స్ అద్భుతంగా ఆరంభించాడు. అప్పుడు నా పని స్ట్రైక్ రొటేట్ చేయడమే. ఈజీ రన్స్ కోసం పరిగెత్తే విషయంలో నేను చాలా గర్వం ఫీలవుతా. ఈజీగా డబుల్ వచ్చే ఛాన్స్ ఉంటే దాని కోసం పరిగెత్తడం కూడా ఈజీనే' అని చెప్పాడు.