పాకిస్తాన్‌తో జరుగుతున్న ఆసియా కప్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అదరగొట్టాడు. ముఖ్యంగా అతను తన ఇన్నింగ్స్‌లో గేరు మార్చిన విధానం ఫ్యాన్స్‌కు తెగ నచ్చేసింది. ఆరంభంలో చాలా నిదానంగా ఆడిన అతను.. ఆ తర్వాత భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. పాక్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్‌కు చుక్కలు చూపించాడు. అతని బ్యాటింగ్ చూసిన మాజీ దిగ్గజం సంజయ్ మంజ్రేకర్ కూడా ఆశ్చర్యపోయాడు.
రోహిత్ భారీ షాట్లు ఆడే టచ్ ఏమాత్రం కోల్పోలేదని, అలాగే అతని డిఫెన్స్ కూడా బాగా మెరుగైందని మంజ్రేకర్ మెచ్చుకున్నాడు. గ్రూప్ దశలో పాక్‌తో జరిగిన మ్యాచులో రోహిత్ విఫలమయ్యాడు. అయితే సూపర్-4 మ్యాచ్‌లో మంచి టచ్‌లో కనిపించిన రోహిత్.. 49 బంతుల్లో 56 పరుగులతో ఆకట్టుకున్నాడు. షాదాబ్ బౌలింగ్‌లో మూడు సిక్సర్లు, రెండు ఫోర్లతో విరుచుకుపడ్డాడు.

తర్వాత అతని బౌలింగ్‌లోనే మరో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో అవుటయ్యాడు. దీనిపై మాట్లాడిన మంజ్రేకర్.. రోహిత్ ఇకపై తన హాఫ్ సెంచరీలను సెంచరీలుగా మార్చడంపై ఫోకస్ పెట్టాలని అన్నాడు. ప్రస్తుతం రోహిత్‌ను చూస్తుంటే 2019 వరల్డ్ కప్ సమయంలో ఉన్న ఫామ్ గుర్తొస్తుందని చెప్పాడు. వరల్డ్ కప్ ముందు రోహిత్ ఇలా ఫామ్ అందుకోవడం టీమిండియా చాలా పెద్ద పాజిటివ్ అని అందరూ అంటున్నారు.
'చివరి వరల్డ్ కప్‌లో రోహిత్ ఐదు సెంచరీలు చేశాడు కదా. నా దృష్టిలో రోహిత్ డిఫెన్స్ గేమ్ చాలా మెరుగైంది. 2019లో కన్నా ఇప్పుడు రోహిత్ చాలా మెరుగైన టెస్టు ప్లేయర్. కాబట్టి నాకు ఈ విషయంలో ఎలాంటి ఇబ్బందులు కనిపించడం లేదు. ఇప్పుడు రోహిత్ ఫోకస్ పెట్టాల్సింది.. తన హాఫ్ సెంచరీలను శతకాలుగా మలచడంపైనే' అని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.
'ఇలా సెంచరీలు చేయాలంటే.. హాఫ్ సెంచరీ తర్వాత చాలా సింగిల్స్, డబుల్స్ తీయాల్సి ఉంటుంది. అయితే కేవలం డిఫెన్స్ క్వాలిటీలో చూసుకుంటే.. రోహిత్ ఇప్పుడు చాలా మెరుగయ్యాడు. అలాగే సింపుల్‌గా భారీ షాట్లు ఆడే ట్యాలెంట్ కూడా ఎక్కడికీ పోలేదు' అని మంజ్రేకర్ మెచ్చుకున్నాడు. 2019 వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన రోహిత్ శర్మ.. ఆ టోర్నీలో ఇంగ్లండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, పాకిస్తాన్ జట్లపై ఐదు శతకాలతో రికార్డు సృష్టించాడు.