భారత్‌తో జరుగుతున్న ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్‌లో పాక్ ప్లేయర్ల ఫన్నీ చేష్టలు ఫ్యాన్స్‌కు తెగ నవ్వు తెప్పించాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ సారధి బాబర్ ఆజమ్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఇక భారత టాపార్డర్‌ను మరోసారి ఇబ్బంది పెట్టేందుకు షహీన్ అఫ్రిదీ, నసీమ్ షా ప్రయత్నించారు. ఈ క్రమంలో నసీం షా వేసిన ఒక బంతిని గిల్ అంచనా వేయడంలో తడబడ్డాడు.
దీంతో ఎడ్జ్ తీసుకున్న బంతి.. స్లిప్స్ వైపు దూసుకెళ్లింది. అది చూసిన అందరూ ఇక గిల్ ఇన్నింగ్స్ ముగిసిందనే అనుకున్నారు. కానీ స్లిప్స్‌లో ఉన్న ఫీల్డర్లు మాత్రం దిక్కులు చూస్తుండిపోయారు. కీపర్ రిజ్వాన్ తన కుడి వైపుకు జంప్ చేశాడు. కానీ ఆ బంతి మొదటి, రెండో స్లిప్స్‌లో ఉన్న ఫీల్డర్ల మధ్య నుంచి వెళ్లిపోయింది. ఆ ప్లేస్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సల్మాన్, ఇఫ్తికర్ ఇద్దరూ కూడా అవతలి ఫీల్డర్ క్యాచ్ పట్టేస్తాడనే ఫీలింగ్‌తో కనీసం ట్రై కూడా చేయలేదు.

ఇది చూసిన పాక్ ఫ్యాన్స్ నోరెళ్లబెట్టారు. దానికితోడు ఆ బంతి ఫోర్‌కు వెళ్లింది. దీంతో అసలు స్లిప్స్‌లో ఫీల్డర్లు అంత దగ్గరగా ఎందుకు నిలబడ్డారని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇక అంతకుముందు రోహిత్ శర్మ ముందుకు దూకి భారీ షాట్ ఆడబోయాడు. కానీ బంతి అతని బ్యాటును మిస్ అయింది. దాన్ని అందుకున్న కీపర్ రిజ్వాన్.. అవుట్ కోసం అప్పీల్ చేశాడు. అంపైర్ స్పందించలేదు.
రిజ్వాన్ కూడా బంతి.. బ్యాటును తాకిందో లేదో క్లారిటీగా చెప్పలేకపోయాడు. అయినా సరే బాబర్ ఆజమ్ రివ్యూ తీసుకున్నాడు. రిప్లేలో బంతికి, బ్యాటుకు మధ్య చాలా గ్యాప్ ఉన్నట్లు కనిపించింది. దీంతో పాక్ రివ్యూ కోల్పోయింది. ఇక తర్వాత రాహుల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కూడా ఇలాంటి ఘటనలు రెండు జరిగాయి. హారిస్ రవూఫ్ వేసిన బంతిని రాహుల్ మిస్ అయ్యాడు.
అది వెళ్లి అతని వెనుక కాలుకు తగిలింది. ఎల్బీడబ్ల్యూకు అప్పీల్ చేయగా అంపైర్ నిరాకరించాడు. కానీ బౌలర్ అది అవుటనే అన్నాడు. ఇది చూసిన బాబర్.. అసలు బంతి ఎక్కడ తగిలింది? అంటూ మిగతా ఫీల్డర్లను అడిగాడు. దీనిపై క్లారిటీ లేకపోవడంతో రివ్యూ తీసుకోలేదు. ఆ తర్వాత కాసేపటికి మరో బంతిని రాహుల్ మిస్ చేశాడు. దాన్ని అందుకున్న రిజ్వాన్.. అవుట్ కోసం అప్పీల్ చేస్తూ నానా గొడవ చేశాడు.
అయితే కెప్టెన్ ఆజామ్ మాత్రం కొంత అనుమానం వ్యక్తం చేశాడు. అప్పటికే ఒక రివ్యూ కోల్పోవడంతో ఈసారి అంత త్వరగా రివ్యూ కోసం అతను వెళ్లలేదు. మిగతా ఫీల్డర్ల అభిప్రాయం కూడా తీసుకొని, తనకు కూడా నమ్మకం లేకపోవడంతో రివ్యూ కోరలేదు. తీరా చూస్తే రిప్లేలో ఆ బంతి.. రాహుల్ బ్యాట్‌ను తాకలేదని తేలింది. ఇది చూసిన ఫ్యాన్స్ మరసారి రిజ్వాన్‌ను ట్రోల్ చేస్తున్నారు. కనీసం శబ్దం కూడా వినకుండా అంత గొడవ అవసరమా? అని అడుగుతున్నారు.
రిజ్వాన్ ఎంత బలంగా అప్పీల్ చేస్తే.. అది అంత కచ్చితంగా నాటౌల్ అయి ఉంటుందంటూ జోకులు పేలుస్తున్నారు. ఆ తర్వాత కాసేపటికే వర్షం వల్ల మ్యాచ్ మధ్యలో ఆగిపోయింది. ఒకవేళ వర్షం ఆగకపోతే ఈ మ్యాచ్ ఎక్కడ ఆగిందో.. అక్కడి నుంచే రిజర్వ్ డే అయిన సోమవారం నాడు మొదలవుతుంది.