పాకిస్తాన్‌తో జరుగుతున్న ఆసియా కప్ మ్యాచులో రోహిత్ శర్మ అద్భుతంగా ఆడాడు. ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రోహిత్.. తొలి ఓవర్ నుంచే తన ఇంటెంట్ స్పష్టం చేశాడు. ముఖ్యంగా పాక్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో అయితే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అయితే ఆ తర్వాత అతని బౌలింగ్‌లోనే షాట్‌ను మిస్ జడ్జ్ చేసి పెవిలియన్ చేరాడు.
దీనిపై టీమిండియా మాజీ లెజెండ్ గౌతం గంభీర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇలా సరిగా జడ్జ్ చేయని షాట్ ఆడి ఎలా అవుట్ అవుతావ్? అంటూ మండిపడ్డాడు. రోహిత్ ఈ మ్యాచులో 49 బంతుల్లో 56 పరుగులు చేసి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అతనితోపాటు గిల్ కూడా హాఫ్ సెంచరీ చేయడంతో వర్షం వల్ల ఆట ఆగే సమయానికి భారత జట్టు 24.1 ఓవర్లలో 147/2 స్కోరు చేసింది. ఈ మ్యాచ్ సోమవారం నాడు మళ్లీ ఇక్కడి నుంచే మొదలవుతుంది.

'రోహిత్ ఇలా అవుటైనందుకు చాలా చికాకు పడుతూ ఉంటాడు. అతను అవుటైంది ఒక పరమ చెత్త షాట్ ఆడి. ఆ టైంలో పాక్ చాలా వెనుకబడి ఉంది. అలాంటి సమయంలో అలా చెత్త షాట్ ఆడటం తన తప్పు అని రోహిత్‌కు కూడా తెలుసు' అని గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఇలా రోహిత్ అవుట్ అవడం వల్ల పాకిస్తాన్ మళ్లీ గేమ్‌లోకి దూసుకొచ్చిందని చెప్పాడు.
'ఒక టైంలో చూస్తే ఇండియా ఈజీగా 370-375 రన్స్ చేసేలా కనిపించింది. అలాంటి సమయంలో రోహిత్ ఒక చెత్త షాట్ ఆడాడు. ఆ తర్వాతి ఓవర్లోనే గిల్ అవుటయ్యాడు. పాకిస్తాన్ వంటి బౌలింగ్ ఎటాక్ ఉన్న జట్టుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు' అని గంభీర్ అన్నాడు. రోహిత్, గిల్ ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 121 పరుగులు జోడించారు.
షాదాబ్ బౌలింగ్‌లో అనవసరమైన షాట్ ఆడిన రోహిత్.. లాంగాఫ్‌లో ఫహీంకు క్యాచ్ ఇచ్చాడు. ఇక ఆ మరుసటి ఓవర్లోనే షహీన్ బౌలింగ్‌లో గిల్ అవుటయ్యాడు. షహీన్ వేసిన స్లోబాల్‌ను అంచనా వేయలేకపోయిన గిల్.. కవర్స్‌లో ఉన్న ఆఘా సల్మాన్‌కు చాలా సింపుల్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.