ఆసియా కప్‌లో భారత్, పాక్ మ్యాచ్ జరుగుతున్న ప్రతిసారీ.. అందరికీ గుర్తొచ్చేది 2012లో కోహ్లీ బాదిన 183 పరుగులు ఇన్నింగ్సే. ఆ మ్యాచ్‌లో భారీ లక్ష్య ఛేదనను భారత జట్టు చాలా పేలవంగా ఆరంభించింది. ఇలాంటి సమయంలో అత్యద్భుతంగా ఆడిన కోహ్లీ కేవలం 148 బంతుల్లోనే 22 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 183 పరుగులు చేశాడు. దీంతో భారత్ ఆ మ్యాచులో సునాయాసంగా గెలిచింది.
తాజాగా ఆసియా కప్ 2023లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించిన సంగతి తెలిసిందే. సూపర్-4 మ్యాచ్‌ను కూడా వర్షం అడ్డుకోవడంతో ఆటను రిజర్వ్ డేకు వాయిదా వేశారు. ఈ సందర్భంగా టీమిండియా మాజీ లెజెండ్ గౌతం గంభీర్.. అప్పటి కోహ్లీ ఇన్నింగ్స్‌ను గుర్తుచేసుకున్నాడు. ఆ ఇన్నింగ్స్‌ను తెగ మెచ్చుకున్న గంభీర్.. రోహిత్ చేసిన డబుల్ సెంచరీల కన్నా ఆ ఇన్నింగ్సే గొప్ప అనేశాడు.

ఆ మ్యాచ్‌లో ఉన్న ఒత్తిడి, అంత భారీ స్కోరును ఛేయడంలో ఉండే ప్రెజర్, పాక్ క్వాలిటీ బౌలింగ్.. వీటన్నిటితోపాటు ఆ మ్యాచ్‌లో భారత్ చాలా పేలవంగా ఛేజ్‌ను మొదలు పెట్టిన విషయాన్ని గంభీర్ గుర్తుచేశాడు. ఆ మ్యాచ్‌లో గంభీర్ డకౌట్‌గా పెవిలియన్ చేరిన సంగతి తెలిసిందే. ఇవన్నీ గుర్తుచేసిన గంభీర్.. ఈ కారణాల వల్ల పలువురు చేసిన డబుల్ సెంచరీల కన్నా కోహ్లీ చేసిన 183 పరుగులే గొప్ప ఇన్నింగ్స్ అని చెప్పాడు.
2012లో కోహ్లీ వీరవిహారంతో భారత జట్టు మరో 13 బంతులు మిగిలుండగానే భారీ ఛేజ్ పూర్తి చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికీ ఎంతో మంది అభిమానులు ఈ ఇన్నింగ్స్‌ను మర్చిపోలేరు. ఆ తర్వాత కూడా పాక్‌తో ఎప్పుడు మ్యాచ్ జరిగినా కోహ్లీ చెలరేగడం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఆసియా కప్‌లో కూడా పాక్‌పై అతను రాణిస్తాడని అంతా ఆశిస్తున్నారు.

అయితే గ్రూప్ దశ మ్యాచులో కోహ్లీ దురదృష్టవశాత్తూ అవుటయ్యాడు. దీంతో సూపర్-4 మ్యాచ్‌పై మరింతగా ఆశలు పెంచుకున్నారు ఫ్యాన్స్. కానీ ఆ మ్యాచ్ కూడా ఆదివారం నాడు వర్షం వల్ల ఆగిపోయింది. అయితే ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉండటంతో సోమవారం నాడు ఈ మ్యాచ్ కొనసాగుతుంది. మ్యాచ్ ఆగే సమయానికి క్రీజులో ఉన్న కోహ్లీ.. సోమవారం నాడు చెలరేగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.