ఆసియా కప్‌లో మరోసారి దాయాదుల పోరు మొదలైంది. కొలంబో వేదికగా భారత్, పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాప్ గెలిచిన పాకిస్తాన్ సారధి బాబర్ ఆజమ్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత జట్టులో రెండు కీలక మార్పులు చేసినట్లు రోహిత్ శర్మ ప్రకటించాడు. ఇటీవల తండ్రయిన జస్‌ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్‌లో ఆడుతున్నట్లు తెలిపాడు.
బుమ్రా తిరిగి రావడంతో మహమ్మద్ షమీని పక్కన పెట్టినట్లు రోహిత్ వెల్లడించాడు. ఇదే అభిమానులకు నచ్చలేదు. షమీ వంటి క్వాలిటీ బౌలర్‌ను పక్కన పెట్టడం ఏంటని నిలదీశారు. ఇక కేఎల్ రాహుల్ కూడా ఈ మ్యాచ్‌తో రీఎంట్రీ ఇస్తున్నట్లు తెలియడంతో.. అతని కోసం ఎవరిని పక్కన పెడతారా? అని ఫ్యాన్స్‌లో టెన్షన్ ఉంది.

గత పాకిస్తాన్ మ్యాచ్‌లో రాణించిన ఇషాన్ కిషన్‌ను పక్కన పెట్టడం కరెక్ట్ కాదని పలువురు మాజీలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రోహిత్ అండ్ కో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రేయాస్ అయ్యర్‌కు చిన్న గాయం తగిలిందని, కాబట్టి అతని స్థానంలో రాహుల్ ఆడుతున్నాడని ప్రకటించారు. అయితే దీన్ని ఫ్యాన్స్ అంత ఈజీగా నమ్మడం లేదు. ఇవన్నీ కవర్ స్టోరీలంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
నాలుగో నెంబర్‌లో అయ్యర్ కన్నా బెటర్ బ్యాటర్ లేడనే కారణంతో అతన్ని జట్టులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అలాంటి వాడిని రాహుల్ కోసం పక్కన పెట్టడం కరెక్ట్ కాదని చాలా మంది ఫ్యాన్స్ అంటున్నారు. ఈ గాయాలన్నీ నాటకాలని మండిపడుతున్నారు. అయ్యర్ గత పాక్ మ్యాచులో సరిగా ఆడకపోవడంతోనే అతన్ని తీసేశారని మరికొందరు అంటున్నారు.
ఏదేమైనా అయ్యర్‌ను పక్కన పెట్టడం వల్ల టీమిండియా మిడిలార్డర్ బలహీనం అయిందని అంటున్నారు. అతని స్థానంలో వచ్చిన రాహుల్ ఆడకపోతే ఈ విమర్శలు మరింత పెరుగాయని అనడం అతిశయోక్తి కాదు.