పాక్‌తో మ్యాచ్‌లో భారత ఓపెనర్లు అద్భుతంగా ఆడారు. గ్రూప్ దశలో తమను ఇబ్బంది పెట్టిన బౌలర్లను ఈ మ్యాచ్‌లో రోహిత్, గిల్ ఒక ఆట ఆడుకున్నారు. ముఖ్యంగా రోహిత్ అద్భుతంగా ఆడాడు. ఆరంభంలో చాలా నిదానంగా ఆడిన రోహిత్ ఇన్నింగ్స్ చాలా మంది ఫ్యాన్స్‌కు బోర్ కొట్టించింది. ఒకానొక సమయంలో 26 బంతుల్లో కేవలం 10 పరుగులే చేశాడీ స్టార్ ఓపెనర్.
అదే సమయంలో గిల్ మాత్రం 13 బంతుల్లోనే 25 పరుగులు చేశాడు. దీంతో గిల్ ఆడినంత వేగంగా కూడా రోహిత్ ఆడటం లేదని, పాక్ పేసర్లను సరిగా ఎదుర్కోలేక పోతున్నాడని కొందరు అనుకున్నారు. గిల్ హాఫ్ సెంచరీ అయ్యే వరకు కూడా రోహిత్ చాలా నెమ్మదిగానే ఆడాడు. దీంతో అతని అభిమానులు కూడా ఇదేంట్రా రోహిత్ ఇలా ఆడుతున్నాడు? అనుకున్నారు.

ఇక గిల్ హాఫ్ సెంచరీ అవ్వగానే రోహిత్ గేర్ మార్చాడు. ముఖ్యంగా పాకిస్తాన్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో ఏకంగా మూడు సిక్సర్లు, రెండు ఫోర్లతో చుక్కలు చూపించాడు. తను ఆడిన మొదటి 26 బంతుల్లో పది పరుగులే చేసిన రోహిత్.. ఆ తర్వాత ఆడిన 22 బంతుల్లో 46 పరుగులు పిండుకున్నాడు. ఇలా రోహిత్ ఎదురుదాడి చేయడంతో పాక్ బౌలర్లకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు.
అదే జోరులో మరో భారీ షాట్ ఆడబోయిన రోహిత్.. 49 బంతుల్లో 56 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. ఇలా రోహిత్ గేరు మార్చడం చూసిన ఫ్యాన్స్ అతనికి దాసోహం అంటున్నారు. గేర్లు మార్చడంలో లంబోర్ఘినీ కారు కన్నా రోహిత్ ఫాస్ట్ అంటూ జోకులేస్తున్నారు. టెస్టు ఇన్నింగ్స్ నుంచి సడెన్‌గా టీ20 ఇన్నింగ్స్ ఆడేస్తున్నాడంటున్నారు. పాక్ వైస్ కెప్టెన్‌కు చుక్కలు చూపించాడని మెచ్చుకుంటున్నారు.