ఈసారి ఆసియా కప్ చూస్తున్న ఫ్యాన్స్‌కు వర్షం తెగ చికాకు తెప్పిస్తోంది. ముఖ్యంగా ఫ్యాన్స్ అందరూ ఎదురు చూసిన భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు వరుణుడు సమస్యగా మారుతూనే ఉన్నాడు. గ్రూప్ దశలో జరిగిన మ్యాచ్ కూడా వర్షం వల్ల ఫలితం లేకుండా ముగిసిన సంగతి తెలిసిందే. ఇక సూపర్-4లో జరుగుతున్న మ్యాచ్‌కు కూడా ఆదివారం నాడు వర్షం ఆటంకం కలిగించింది.
దీంతో రిజర్వ్ డే అయిన సోమవారం నాటికి మ్యాచ్‌ను వాయిదా వేశారు. అయితే రిజర్వ్ డే నాడు కూడా 80 శాతం వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది చూసిన ఫ్యాన్స్‌కు కడుపు మండిపోతోంది. ఇలా ఆసియా కప్ మొత్తాన్ని బీసీసీఐ జై షా సర్వనాశనం చేశాడని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలతో కొలంబో అతలాకుతలం అవుతుంటే.. అక్కడి నుంచి కూడా మ్యాచులు మార్చకపోవడాన్ని ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు.

ఆసియా కప్ సర్వనాశనం చేసిన ఒకే ఒక్కడు అంటూ జై షా ఫొటోలను నెట్టింట షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్. కొందరైతే శ్రీలంకను వేదికగా సెలెక్ట్ చేసినప్పుడే మ్యాచులు నిర్వహించడానికి పడవలు కొనుక్కోలేకపోయారా? అని జోకులు వేస్తున్నారు. ఫ్యాన్స్ అందరూ ఆసియా కప్ ఇలా నీళ్లపాలు అవడానికి కారణం జై షానే అని సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.
ఇలా మ్యాచులు వర్షార్పణం అవుతున్నందుకు ఏసీసీని నిందించాలని, అయితే ఏసీసీ సెక్రటరీ అయిన జై షా కూడా దీనికి బాధ్యుడే అని ఫ్యాన్స్ అంటున్నారు. కొందరైతే అతన్ని నోటికి వచ్చిన బూతులు తిట్టేస్తూ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు తమ జీవితంలో ఇంత చెత్త మేనేజ్‌మెంట్ చూడలేదని ఫ్యాన్స్ తిట్టిపోస్తున్నారు. వర్షాలు పడే శ్రీలంకలో ఆసియా కప్ నిర్వహించాలని జై షా ఎందుకు డిసైడ్ అయ్యాడంటూ ప్రశ్నిస్తున్నారు.