Supreme Court: ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(PIL)పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అదొక ఆట మాత్రమేనని.. దానిని ఉండనివ్వండంటూ న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
ఆసియా కప్ 2025 షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి భారత్-పాకిస్థాన్ మధ్య రాజకీయ సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో ఈ మ్యాచ్ అవసరమా అనే చర్చ మొదలైంది. ముఖ్యంగా పహల్గాం దాడి, దాని తర్వాత జరిగిన ఆపరేషన్ సింధూర్ వంటి సంఘటనల తర్వాత ఈ వివాదం మరింత పెరిగింది. సెప్టెంబర్ 14న జరగనున్న మ్యాచ్‌కు కొద్ది రోజుల ముందు మ్యాచ్‌ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఓ పిల్ దాఖలైంది. జస్టిస్ జె.కె.మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించడానికి నిరాకరించింది. "అదొక ఆట మాత్రమే, దానిని ఉండనివ్వండి" అంటూ వ్యాఖ్యానించింది.

కోర్టులో జరిగిన సంభాషణ ఇలా..
న్యాయవాది: నా కేసు అంత బాగోలేదని నాకు తెలుసు, అయినా దీన్ని విచారణకు స్వీకరించండి.
జస్టిస్ మహేశ్వరి: దీనికి అంత అత్యవసరం ఏముంది? ఇది ఒక మ్యాచ్ మాత్రమే, దానిని ఉండనివ్వండి. మ్యాచ్ ఆదివారం ఉంది, మనం ఏం చేయగలం?
పిటిషన్‌లో ఏముంది?
ఉర్వశి జైన్ తో పాటు నలుగురు న్యాయ విద్యార్థులు రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్‌లో భారత పౌరులు, సైనికులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం జాతీయ గౌరవానికి, ప్రజల భావాలకు విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఉగ్రవాదానికి ఆశ్రయం ఇస్తున్న దేశంతో క్రీడా సంబంధాలు కొనసాగించడం భారత సాయుధ దళాల మనోబలాన్ని దెబ్బతీస్తుందని.. అమరవీరుల కుటుంబాలకు బాధ కలిగిస్తుందని పిటిషన్ లో పేర్కొన్నారు. జాతీయ ప్రయోజనాలు, పౌరుల ప్రాణాలు, సైనికుల త్యాగాల కంటే క్రికెట్ ముఖ్యం కాదని పిటిషనర్లు పేర్కొన్నారు. అయితే ఈ అంశంపై అత్యవసర విచారణకు కోర్టు నిరాకరించింది.
వివాదంపై బీసీసీఐ వైఖరి:
భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లను రద్దు చేయాలని లేదా బహిష్కరించాలని పిలుపునివ్వడం ఇది మొదటిసారి కాదు. అయితే, బీసీసీఐ తన వైఖరిని స్పష్టం చేస్తూ, కేంద్ర ప్రభుత్వ విధానానికి కట్టుబడి ఉంటామని తెలిపింది. కేంద్రం బహుళ-దేశాల టోర్నమెంట్‌లలో పాల్గొనడానికి అనుమతిస్తుంది కానీ పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లను మాత్రం పరిమితం చేసింది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఇటీవల మాట్లాడుతూ.. బహుళ-దేశాల టోర్నమెంట్లను బహిష్కరిస్తే ఆసియా క్రికెట్ కౌన్సిల్ లేదా ఐసీసీ వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఇది భారత ఆటగాళ్ల కెరీర్‌కు నష్టం చేకూరుస్తుందని అన్నారు. ప్రభుత్వ ఈ విధానం జాతీయ భావాలకు, అంతర్జాతీయ వేదికలపై భారత క్రీడలు, క్రీడాకారుల విస్తృత ప్రయోజనాలకు మధ్య సమతుల్యత సాధించడానికి ఉద్దేశించబడింది.ద్వైపాక్షిక మ్యాచ్‌లు ఆడటానికి భారత్‌కు ఆసక్తి లేనప్పటికీ, బహుళ-జట్ల టోర్నమెంట్ల విషయంలో బోర్డుకు తన చేతుల్లో ఏమీ ఉండదని సైకియా స్పష్టం చేశారు.