ద్వైపాక్షిక సిరీస్ అయినా ఐసీసీ టోర్నీ అయినా.. భారత్ - పాక్ మ్యాచ్ అంటేనే స్పెషల్ క్రేజ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అందుకే దాయాది జట్ల మధ్య మ్యాచ్ వస్తే క్రికెట్ ప్రియులు టీవీలకు అతుక్కుపోతారు. స్టేడియాల్లో కిక్కిరిసిపోతారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి మరి కొద్ది రోజులే సమయం మిగిలి ఉంది. ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ .. క్రికెట్ ఫ్యాన్స్ కోసం ఓ సర్ ప్రైజ్ తీసుకొచ్చింది.
త్వరలోనే భారత్ - పాక్ క్రికెట్ కు సంబంధించి డాక్యుమెంటరీని రిలీజ్ చేయనుంది. ఈ మేరకు అఫీషియల్ గా సోషల్ మీడియాలో ప్రకటిస్తూ ఓ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఫిబ్రవరి 7 నుంచి ఇది స్ట్రీమింగ్ కానున్నట్లు పేర్కొంది. 'ది గ్రేటెస్ట్ రైవల్రీ : ఇండియా వర్సెస్ పాకిస్థాన్' పేరుతో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది. పోస్టర్ లో ఓపెనింగ్ పెయిర్ సచిన్, సెహ్వాగ్ జెరీ ధరించి మైదానంలో పాక్ జట్టుతో తలపడేందుకు సిద్ధంగా ఉన్నట్లు చూపించింది.

ఈ డాక్యుమెంటరీ సిరీస్ లో రెండు దేశాలకు చెందిన దిగ్గజ ప్లేయర్స్ వీరేంద్ర సెహ్వాగ్, గంగూలీ, షోయబ్ అక్తర్, వాకర్ యూనిస్, రవిచంద్రన్ అశ్విన్, జావెద్ మియానంద్, ఇంజమాన్ ఉల్ హక్ సహా పలువురు ఉన్నట్లు తెలిసింది.
గతంలో భారత్ పాక్ మధ్య జరిగిన ఉత్కంఠ పోరుకు సంబంధించిన చిరస్మరణీయ సందర్భాలు, అసలు దాయాది దేశాలు పోరు ఎట్లా ఉండేది, ఇప్పుడెలా ఉంది వంటి అంశాలను ఇందులో చూపించనున్నట్లు తెలుస్తోంది. "రెండు దేశాలు. ఒక అద్భుతమైన పోటీ. 160 కోట్ల మంది ప్రజల ప్రార్థనలు. ది గ్రేటెస్ట్ రైవల్రీ : ఇండియా vs పాకిస్థాన్. మరెక్కడా, ఎప్పుడూ ఇవ్వనంత ఓ గొప్ప థ్రిల్లింగ్ మ్యాచ్ ఫ్రిబ్రవరి 7న నెట్ ఫ్లిక్స్ లో ఆస్వాదించండి." అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది.
కాగా, త్వరలో ప్రారంభం కానున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ - పాక్ మ్యాచ్ ఫ్రిబ్రవరి 23న దుబాయ్ వేదికగా జరగనుంది. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ పాకిస్థాన్ -న్యూజిలాండ్ మధ్య జరగనుంది. టీమిండియా ఆడే మ్యాచులన్నీ దుబాయ్ లో జరగనున్నాయి.