Rohit Sharma: ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్‌లో భాగంగా వెస్టిండీస్‌లో పర్యటిస్తోన్న దక్షిణాఫ్రికా తొలి విజయాన్ని అందుకుంది. వెస్టిండీస్‌తో గుయానాలోని ప్రావిడెన్స్ స్టేడియంలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో 40 పరుగుల తేడాతో విజయ కేతనాన్ని ఎగురవేసింది.
తొలి ఇన్నింగ్‌లో 160 పరుగులకే ఆలౌట్ అయిన దక్షిణాఫ్రికా.. ఆ తరువాత పుంజుకొంది. తొలి ఇన్నింగ్‌లో విండీస్ వీరులను 144 పరుగులకే కుప్పకూల్చింది. మిడిలార్డర్ బ్యాటర్ జేసన్ హోల్డర్ ఒక్కడే టాప్ స్కోరర్. 54 పరుగులతో ప్రొటీస్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనగలిగాడు. టెయిలెండర్ షమర్ జోసెఫ్ 25 పరుగులతో ఆదుకున్నాడు.

రెండో ఇన్నింగ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఫర్వాలేదనిపించింది. 246 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్‌తో కలిపి 262 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్‌కు నిర్దేశించింది. జేడెన్ సీల్స్ ఆరు వికెట్లతో మెరుపులు మెరిపించాడు. అద్భుతమైన బంతులతో సత్తా చాటాడు. అవుట్ స్వింగ్, ఇన్ స్వింగ్, యార్కర్లతో చెలరేగాడు. ఒక వెలుగు వెలిగిన ఫాస్ట్ బౌలింగ్‌కు మళ్లీ పూర్వవైభవాన్ని తీసుకొచ్చేలా కనిపించాడు.
263 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ మరోసారి విఫలమైంది. 222 పరుగులకు బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం కుప్పకూలింది. తొలి ఇన్నింగ్‌లో హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్న జేసన్ హోల్డర్.. రెండో ఇన్నింగ్‌లో డకౌట్ అయ్యాడు. కేశవ్ మహరాజ్, కగిసొ రబడ మూడు వికెట్లు పడగొట్టారు. వియాన్ మల్డర్, డేన్ పీట్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
ఈ మ్యాచ్ అనంతరం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో మారిపోయింది. భారత్.. అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఇప్పటివరకు ఆడిన తొమ్మిది మ్యాచ్‌లల్లో ఆరింట గెలిచింది. రెండింట్లో ఓడిపోగా ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింద. మొత్తం 74 పాయింట్లతో అగ్రస్థానానికి ఎగబాకింది.
90 పాయింట్లతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియాకు పాయింట్లు ఎక్కువే అయినప్పటికీ.. విజయాల శాతం భారత్‌కే అధికంగా ఉండటం వల్ల రెండోస్థానానికి పరిమితం కావాల్సొచ్చింది కంగారూలకు. భారత జట్టు దూకుడు ఇదే స్థాయిలో కొనసాగితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ ఆడటం లాంఛనప్రాయమే అవుతుంది.
భారత్- 68.51, ఆస్ట్రేలియా- 62.50 శాతం పీసీటీని నమోదు చేశాయి. మూడో స్థానంలో న్యూజిలాండ్, నాలుగో పొజీషన్‌లో శ్రీలంక, ఆ తరువాత దక్షిణాఫ్రికా నిలిచాయి. చివరి నాలుగు స్థానాల్లో పాకిస్తాన్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, వెస్టిండీస్ ఉన్నాయి.