
హైదరాబాద్: క్రికెట్ మైదానంలో విరాట్ కోహ్లీ ఎంత దూకుడుగా కనిపిస్తాడో.. మహేంద్ర సింగ్ ధోనీ అంత ప్రశాంతంగా కనిపిస్తాడు. కోహ్లీ దూకుడు.. మహేంద్ర సింగ్ ధోనీ ప్రశాంతత ఈ రెండు అంశాలు టీమిండియా 2019 ప్రపంచకప్ అందుకునేందుకు ఎంతో దోహదపడతాయని అంటున్నాడు భారత మాజీ క్రికెటర్ కపిల్ దేవ్. భారత్‌కు తొలి ప్రపంచకప్ అందించిన సారథి కపిల్‌దేవ్.
తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'జట్టులో అందరూ దూకుడు ప్రదర్శించే ఆటగాళ్లు ఉన్నా ప్రమాదమే. అలాగని అందరూ ప్రశాంతంగా ఉన్నా కష్టమే. అందుకే ఈ రెండు కలిసి ఉండాలి. ఇది జట్టుకు ఎంతో ఉపయోగపడుతుంది' అని కపిల్ తెలిపాడు.
'తదుపరి ప్రపంచకప్‌లో భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ దూకుడు. మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ ప్రశాంతత భారత్ మరోసారి ప్రపంచకప్ అందుకునేందుకు దోహదపడతాయి. ఇలాంటి కాంబినేషన్లు ఉండటంలో ఎలాంటి తప్పులేదు. జట్టుకు ఇది చాలా అవసరం. ఎలాగంటే మైదానంలో ఎవరైతే ప్రశాంతంగా ఉంటారో వారు ఆటను బాగా అర్థం చేసుకోగలరు. అలాగే మరోపక్క దూకుడు ప్రదర్శించే ఆటగాళ్లూ ఉండాలి' అని కపిల్‌దేవ్ వివరించాడు.
ప్రస్తుత టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్‌లో ఇంకా మెరుగుపడాలని మాజీ ఆల్‌రౌండర్, భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ సూచించారు. అతను మంచి ఆటగాడే కానీ, అతని నుంచి ఎక్కువగా ఆశిస్తుండటంతో ఒత్తిడి పెరిగి ఆడలేకపోతున్నాడు. ఈ సందర్భంగా దక్షిణాఫ్రికా పర్యటనలో మొదటి ఇన్నింగ్స్ ఆడి 93 పరుగులు చేసిన పాండ్యా మరే ఇన్నింగ్స్ లోనూ అంతగా రాణించలేకపోయిన విషయాన్ని గుర్తు చేశాడు.