WTC Final : ముగ్గురు స్టార్లు దూరం.. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమిండియా బలం సగమే..!

వరుసగా రెండోసారి వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ చేరిన భారత జట్టు ఈసారి కూడా గెలవడం కష్టంగా కనిపిస్తోంది. టీమిండియా ఈ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించిన ముగ్గురు స్టార్ క్రికెటర్లు ఫైనల్‌లో ఆడటం లేదు. జూన్ 7వ తేదీన ఇంగ్లండ్‌లోని ఓవల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ముగ్గురు స్టార్లను మిస్ అవుతుంది. వాళ్లెవరో కాదు.. పేస్ గుర్రం జస్‌ప్రీత్ బుమ్రా, మిడిలార్డర్ బ్యాటర్లు శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్.

యాక్సిడెంట్ వల్ల పంత్..
గతేడాది చివర్లో కారులో ఇంటికి వెళ్తున్న రిషభ్ పంత్‌కు యాక్సిడెంట్ అయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్ కాళ్లకు పలు శస్త్రచికిత్సలు జరిగినట్లు బీసీసీఐ తెలిపింది. ఈ క్రమంలో ఇప్పుడిప్పుడే నెమ్మదిగా కోలుకుంటున్న రిషభ్ పంత్.. మరికొన్ని రోజుల్లో జరిగే ఐపీఎల్ 2023లో కూడా ఆడటం లేదు. ఏడాది చివర్లో జరిగే వన్డే వరల్డ్ కప్‌లో కూడా పంత్ ఆడటం అనుమానంగా కనిపిస్తోంది. యాక్సిడెంట్ ముందు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పేలవ ఫామ్ కనబరిచిన పంత్.. టెస్టుల్లో మాత్రం భారత్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

తిరగబెట్టిన అయ్యర్ ప్రాబ్లం..
పంత్ తర్వాత టెస్టుల్లో అద్భుతంగా రాణించిన బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్. ఈ ఏడాది ఆరంభం నుంచే వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్న అతను.. కివీస్‌తో వన్డే సిరీస్‌లో ఆడలేదు. ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు కూడా దూరమయ్యాడు. మళ్లీ నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో అతని వెన్నునొప్పి తిరగబెట్టింది. దీంతో మళ్లీ జట్టుకు దూరమయ్యాడీ మిడిలార్డర్ బ్యాటర్. అతనికి కూడా శస్త్రచికిత్స అవసరం అని తెలుస్తోంది. ఈ క్రమంలో అతను కూడా ఐపీఎల్ 2023తోపాటు డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కూడా ఆడటం లేదని బీసీసీఐ వర్గాలు చెప్తున్నాయి.

మానని బుమ్రా గాయం..
ఇక జస్‌ప్రీత్ బుమ్రా గాయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గతేడాది ఈ గాయం కారణంగా జట్టుకు దూరమైన బుమ్రా.. ఆసీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో మళ్లీ జట్టుతో కలిశాడు. ఈ సిరీస్‌లో ఒక్క మ్యాచ్ ఆడిన తర్వాత మళ్లీ అతని గాయం తిరగబెట్టింది. దీంతో టీ20 వరల్డ్ కప్‌లో కూడా ఆడలేదు. ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీసులో అతను ఆడతాడని అనుకుంటే.. అది కూడా జరగలేదు. న్యూజిల్యాండ్‌లో బుమ్రాకు శస్త్రచికిత్స చేయాల్సి ఉందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో అతను కూడా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడటం లేదు. వన్డే వరల్డ్ కప్‌లో కూడా ఆడతాడో లేదో ఇప్పుడే చెప్పలేం. ఇలా ముగ్గురు కీలక ఆటగాళ్లు లేకుండా డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత్ గెలవడం కష్టమే అనిపిస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications