ఉప్పల్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ ఓటమికి రోహిత్ శర్మ కెప్టెన్సీ కారణమని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి సారథి బాధ్యతలు నిర్వర్తిస్తే టీమిండియా పరాజయాన్ని చవిచూసేది కాదని పేర్కొన్నాడు. అయిదు టెస్టులో సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లో ఇంగ్లాండ్‌తో భారత్ తొలి టెస్టు ఆడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను ఘనంగా బోణీ కొట్టాలనుకున్న టీమిండియాకు పెద్దషాక్ తగిలింది. 28 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగుల ఆధిక్యం లభించి కూడా పరాజయాన్ని చవిచూసింది.
''టెస్టు క్రికెట్‌లో విరాట్ కోహ్లి కెప్టెన్సీని భారత్ చాలా మిస్ అవుతుంది. ఆ టెస్టులో విరాట్ సారథిగా ఉండి ఉంటే టీమిండియా ఓటమిని అస్సలు అంగీకరించేవాడు కాదు. రోహిత్ శర్మ లెజెండ్, గొప్ప ఆటగాడే. కానీ ఆ మ్యాచ్‌లో పూర్తిగా స్విచ్ ఆఫ్ మోడ్‌లోకి వెళ్లిపోయాడని అనిపించింది. రోహిత్ కెప్టెన్సీ చాలా ఏవరేజ్‌గా ఉంది. అతడు రియాక్టివ్ ఉంటూ వ్యూహాలు తీసుకుంటాడనుకున్నా. కానీ ఫీల్టింగ్, బౌలింగ్ విషయాల్లో మార్పులేమి చురుకుగా లేవు. ఒలీ పోప్ స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లకు రోహిత్ దగ్గర సమాధానం లభించలేదు'' అని మైకేల్ వాన్ అన్నాడు.

తొలి టెస్టు ఓటమి అనంతరం రోహిత్ శర్మ మరింత ఒత్తిడిలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. విరాట్ కోహ్లి తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడని సిరీస్ ప్రారంభానికి ముందే తెలిసింది. కానీ మొదటి టెస్టులో సీనియర్ ప్లేయర్లు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా గాయాలతో రెండో టెస్టుకు దూరమవ్వడం భారత్‌కు ప్రతికూలాంశంగా మారింది. రోహిత్ శర్మ మినహా బ్యాటింగ్ ఆర్డర్ అనుభవలేమిగా ఉంది. అంతేగాక శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ ఫామ్‌లో లేకపోవడం టీమిండియాను కలవరపెడుతోంది.
సీనియర్లు గాయాలతో జట్టుకు దూరమవ్వడంతో వారి స్థానాల్లో ముగ్గురు ఆటగాళ్లను సెలక్టర్లు ఎంపిక చేశారు. రాహుల్ ప్లేస్‌లో గత మూడేళ్లుగా దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న సర్ఫరాజ్ ఖాన్ సెలక్ట్ అయ్యాడు. మరోవైపు ఆల్‌రౌండర్ జడేజాకు రిప్లేస్‌మెంట్‌గా సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చారు. కాగా, విశాఖపట్నం వేదికగా రెండో టెస్టు శుక్రవారం ప్రారంభం కానుంది.