
హైదరాబాద్: దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా పరుగుల కోసం విరాట్ కోహ్లీపైనే ఎక్కువగా ఆధారపడుతుందని, ఇదే టీమిండియా వీక్‌నెస్ అని సఫారీ కెప్టెన్ డుప్లెసిస్ అన్నాడు. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో మరో టెస్టు మిగిలుండగానే 0-2తో కోహ్లీసేన సిరిస్‌ను చేజార్చుకున్న సంగతి తెలిసిందే.
ఇరు జట్ల మధ్య మూడో టెస్టు జనవరి 24న జోహెన్స్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో జరగనుంది. ఈ నేపథ్యంలో డుప్లెసిస్ మీడియాతో మాట్లడుతూ 'టెస్టు సిరిస్‌లో భారత జట్టు మ్యాచుల్లో పరుగులు చేసే క్రమంలో ఎక్కువగా ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పైనే ఆధారపడుతోంది. కోహ్లీ పరుగులు చేయలేకపోతే ఇక తాము చేయలేము అన్న భావనకు ఆటగాళ్లు వచ్చేస్తున్నారు. ఇదే టీమిండియా వీక్‌నెస్' అని అన్నాడు.
'అదే మా జట్టు విషయానికి వస్తే డివిలియర్స్ పరుగులు చేస్తున్నాడు. డీన్ ఎల్గర్, మర్క్రమ్‌లతో పాటు నేను కూడా పరుగులు చేస్తున్నా. ప్రత్యర్ధి జట్టు టీమిండియాలో మాత్రం అలా జరగడం లేదు. ఇదే టీమిండియాకు మాకు తేడా. క్రికెట్ జట్టుగా ఆడాల్సిన ఆట. ఒక్కడిపైనే ఆధారపడకూడదు. సమష్టిగా రాణించాలి' అని డూప్లిసిస్ చెప్పుకొచ్చాడు.
కేప్‌టౌన్, సెంచూరియన్‌లలో జరిగిన రెండు టెస్టుల్లో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సెంచూరియన్ టెస్టులో రహానే, భువీలను ఆడించకపోవడం వల్లే టీమిండియా ఓటమి పాలైందని పలువురు విమర్శలు చేస్తున్నారు. కనీసం మూడో టెస్టులోనైనా కోహ్లీ వీరిని జట్టులోకి తీసుకుంటాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.