
హైదరాబాద్: బధిరుల (వినికిడి లోపం ఉన్నవారు) ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌కు భారత్ వేదిక కానుంది. గురుగ్రామ్ వేదికగా నవంబర్ 23 నుంచి 30 వరకు ఈ టీ20 వరల్డ్ కప్ జరుగనుందని నిర్వాహకులు వెల్లడించారు.
గురుగ్రామ్‌లో మొత్తం ఎనిమిది రోజుల పాటు జరగనున్న ఈ టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, భారత్ పాల్గొననున్నాయి. ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి జట్టు కూడా మూడు మ్యాచ్‌లు ఆడనుంది.
రెండు గ్రూపుల్లో క్వాలిఫై అయిన రెండు జట్లు సెమీఫైనల్స్‌కు వెళతాయి. బధిరుల క్రికెట్‌ను ప్రోత్సహించడంలో భాగంగా డెఫ్ క్రికెట్ సొసైటీ (డీసీఎస్) డెఫ్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (డెఫ్ ఐసీసీ) సౌజన్యంతో ఈ టీ20 వరల్డ్ కప్‌ను నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా డెఫ్ క్రికెట్ సొసైటీ జనరల్ సెక్రటరీ సుమిత్ జైన్ మాట్లాడుతూ "భారత్‌లో అత్యంత ప్రజాదరణ కలిగిన క్రీడల్లో క్రికెట్ ఒకటి. 2017లో 717 మిలియన్ టీవీ వ్యూయర్లు క్రికెట్‌ను వీక్షించగా, ఒక వారానికి గాను 27 బిలియన్ ఇంప్రషన్స్ నమోదయ్యాయి" అని తెలిపారు.