
లీడ్స్: ఐదు టెస్ట్ మ్యాచుల సిరీసులో భాగంగా లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో గతవారం ముగిసిన రెండో టెస్టులో భారత్ 151 పరుగులతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన పేసర్లు మహ్మద్ షమీ (56 నాటౌట్), జస్ప్రీత్ బుమ్రా (34 నాటౌట్)కు భారత ఆటగాళ్లు ఎప్పటికీ గుర్తుండిపోయే మధుర విజయం అందించారు. ఐదో రోజు ఉదయం 209 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. దీంతో భారత్ త్వరగానే ఆలౌట్ అవుతుందని అందరూ అనుకున్నారు. ఈ సమయంలో షమీ, బుమ్రాలు ఊహించని ఇన్నింగ్స్ ఆడారు.
భోజన విరామ సమయానికి షమీ, బుమ్రా జోడీ 80 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి భారత జట్టును మెరుగైన స్థితిలో నిలిపారు. షమీ, బుమ్రాల భాగస్వామ్యం టీమిండియాకు భారీ ఆధిక్యాన్ని ఇచ్చింది. దాంతో వారు డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చేసరికి జట్టు సభ్యులంతా ఘన స్వాగతం పలకాలని కెప్టెన్ విరాట్ కోహ్లీ ముందే అందరికీ చెప్పాడని ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ తాజాగా వెల్లడించారు. భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానెల్లో శ్రీధర్ మాట్లాడాడుతూ.... 'భోజన విరామంలో బుమ్రా, షమీ డ్రెస్సింగ్ రూమ్‌కు చేరుకుంటున్నారని తెలియగానే విరాట్ కోహ్లీ వాళ్లకు ఘన స్వాగతం పలకాలని జట్టు సభ్యులందరితో అన్నాడు. మనం చేసే శబ్దానికి లార్డ్స్ మైదానం దద్దరిల్లాలని, అది కొన్నేళ్లపాటు గుర్తుండిపోవాలని చెప్పాడు' అని అన్నాడు.
కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పినట్లే జట్టు సభ్యులంతా షమీ, బుమ్రాలకి చప్పట్లతో ఘనస్వాగతం పలికారని.. వారిని అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారని ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ తెలిపారు. షమీ, బుమ్రాలు డ్రెసింగ్ రూమ్ చేరుకోగానే భారత ఆటగాళ్లు అందరూ చప్పట్లతో అబినందించగా.. కోహ్లీ వారిని ప్రత్యేకంగా ప్రశంసించాడు. దీనికి సంబందించిన వీడియోను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ట్విటర్‌లోనూ పంచుకుంది. ఆ వీడియో నెత్తినట వైరల్ అయింది. ఇక రెండో సెషన్ ప్రారంభమైన కాసేపటికే కోహ్లీ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. అప్పటికి భారత్ స్కోర్ 298/8కి చేరుకుంది. అనంతరం ఛేదనకు దిగిన ఇంగ్లండ్ 120 పరుగులకే కుప్పకూలింది. బౌలింగ్‌లో సిరాజ్ సహా బుమ్రా అదరగొట్టాడు.
లీడ్స్ వేదికగా బుధవారం నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్ట్ ఆరంభం కానుంది. మూడో టెస్ట్‌కు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. భుజం గాయంతో ఇంగ్లండ్ స్టార్ పేసర్ మార్క్ వుడ్ మూడో టెస్ట్‌కు దూరమయ్యాడు. లార్డ్స్ టెస్ట్ నాలుగో రోజు ఆటలో మార్క్ వుడ్ గాయపడ్డాడు. మూడో టెస్ట్ సమయానికి అతడు కోలుకుంటాడని ఇంగ్లండ్ జట్టు యాజమాన్యం ఆశించింది. అయితే వుడ్ పూర్తి ఫిట్‌నెస్ సాధించలేకపోవడంతో.. అతను మూడో టెస్ట్‌కు దూరంగా ఉంటాడని ఈసీబీ ఓ ప్రకటనలో తెలిపింది. గాయంతో తప్పుకున్న మార్క్ వుడ్ స్థానంలో సకీబ్ మహమూద్ ఆడనున్నాడు. మరోవైపు భారత్ ఒకటి, రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. రవీంద్ర జడేజా స్థానంలో ఆర్ అశ్విన్.. ఇషాంత్ శర్మ స్థానంలో శార్దూల్ ఠాకూర్ ఆడనున్నాడు.