హాంకాంగ్ సిక్సెస్ టోర్నమెంట్‌లో భారత్ ఒక్క విజయాన్ని కూడా సాధించలేకపోయింది. ఒమన్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లోనూ ఓటమిపాలై టోర్నీ నుంచి పేలవంగా నిష్క్రమించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 6 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. కెప్టెన్ రాబిన్ ఉతప్ప (52 రిటైర్డ్ హట్; 13 బంతుల్లో, 5 ఫోర్లు, 5 సిక్సర్లు) టాప్ స్కోరర్.
భరత్ చిప్లీ (32; 11 బంతుల్లో, 3 ఫోర్లు, 3 సిక్సర్లు), కేదార్ జాదవ్ (14; 5 బంతుల్లో, 2 సిక్సర్లు), శ్రీవాత్స గోస్వామి (10; 3 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్) పరుగులు చేశారు. ఒమన్ బౌలర్లలో అసిఫ్ ఖాన్ ఒక్క వికెట్ తీశాడు. కాగా, అనంతరం ఛేదనలో ఒమన్ వికెట్ నష్టపోకుండా 4.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని సాధించింది. కెప్టెన్ వినాయక్ శుక్లా (54 రిటైర్డ్ హట్; 11 బంతుల్లో, 6 ఫోర్లు, 5 సిక్సర్లు), అసిఫ్ ఖాన్ (46; 12 బంతుల్లో, 5 ఫోర్లు, 4 సిక్సర్లు), హస్నైన్ (18; 3 బంతుల్లో, 3 సిక్సర్లు) విజృంభించారు.

కాగా, ఈ టోర్నీలో భారత్ అయిదు మ్యాచ్‌లు ఆడగా అన్నింట్లోనూ ఓటమిపాలైంది. పాకిస్థాన్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో, యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో ఒక్క పరుగు, ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో, న్యూజిలాండ్‌తో జరిగిన పోరులో 44 పరుగుల తేడాతో ఘోర పరాజయాల్ని చవిచూసింది. కాగా, ఈ టోర్నీ విజేతగా శ్రీలంక నిలిచింది. పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్‌లో లంక మూడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 72 పరుగులకే ఆలౌటైంది. శ్రీలంక అయిదు ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఏడేళ్ల తర్వాత తిరిగొచ్చిన హాంకాంగ్ క్రికెట్ సిక్సెస్ టోర్నీలో 12 జట్లు పాల్గొన్నాయి. కాగా, ఈ టోర్నీలో ప్రతి జట్టులో ఆరుగురు ప్లేయర్లే ఉంటారు. ఓ మ్యాచ్‌లో ప్రతి జట్టు ఆరు ఓవర్లు ఆడుతుంది.