
హైదరాబాద్: విశ్వవేదికపై భారత్ తిరుగులేని రికార్డును పాకిస్థాన్ బద్దలు కొట్టింది. ఐసీసీ ప్రపంచకప్‌లలో భారత్ చేతిలో ఇప్పటివరకు 12 సార్లు ఓటమి పాలైన పాకిస్థాన్.. తొలిసారి అద్భుత విజయం సాధించింది. సూపర్-12 గ్రూప్-2లో భాగంగా ఆదివారం రాత్రి దుబాయ్ మైదానంలో జరిగిన పోరులో అనిశ్చితికి మారుపేరైన పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో భారత్‌పై గెలుపొందింది. ఐసీసీ ప్రపంచకప్‌లలో భారత్‌పై పాకిస్థాన్‌కు ఇదే తొలి గెలుపు కాగా.. 10 వికెట్ల తేడాతో గెలవడం కూడా ఇదే మొదటిసారి. ఇక బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే టీమిండియా ఓడిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓడిపోతుందని ఎవరూ అనుకోలేదు. ఎందుకంటే.. టీ20 ప్రపంచకప్ మ్యాచుల్లో పాక్‌పై టీమిండియాదే పైచేయిగా ఉంది. భారత్ ఐదు మ్యాచులో గెలుపొందగా.. పాక్ ఒకే విజయం అందుకుంది. దాంతో తప్పకుండా కోహ్లీసేన గెలుస్తుందని చాలా మంది అభిమానులు, మాజీలు అభిప్రాయపడ్డారు. కానీ అందరి అంచనాలు భారత ప్లేయర్స్ తలకిందులు చేశారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో విఫలమై ఘోర ఓటమిని మూటగట్టుకున్నారు. భారత్ ఓటమిని టీమిండియా అభిమానులు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. 'ఓవర్ కాన్ఫిడెన్స్' కారణంగానే భారత్ ఓడిపోయిందని కొందరు ట్వీట్లు చేశారు. దాంతో 'Over Confidence' అనే హాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
వాస్తవానికి భారత్ ఓడిపోవడానికి ఓవర్ కాన్ఫిడెన్స్ అసలు కారణమే కాదని చెప్పొచ్చు. ఎందుకంటే భారత్ కంటే పాకిస్తాన్ మెరుగైన క్రికెట్ ఆడింది. ముందుగా బౌలింగ్, ఆపై బ్యాటింగ్ విభాగాల్లో పాక్ సత్తాచాటాడమే భారత ఓటమికి కారణం. మైదానంలో టీమిండియా ప్లేయర్స్ ముఖాల్లో ఎక్కడా ఓవర్ కాన్ఫిడెన్స్ కనబడలేదు. ఈ మ్యాచ్ కోసం భారత్ బెస్ట్ ప్లేయింగ్ 11తోనే బరిలోకి దిగింది. అయితే పిచ్‌పై ఉన్న తేమను పాకిస్తాన్ సద్వినియోగం చేసుకుంది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే మూడు కీలక వికెట్లు తీసి ఆధిపత్యం చెలాయించింది. ఇక పాక్ బ్యాటింగ్ వచ్చేసరికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పిచ్ బ్యాటింగ్‌కు సహరించడంతో పాక్ ఓపెనర్లు సునాయాసంగా పరుగులు చేశారు.
మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా పాకిస్తాన్ బాగా ఆడిందని ఒప్పుకున్నాడు. కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ... 'మేం అనుకున్న ప్రణాళికలను అమలు చేయలేకపోయాం. పాకిస్థాన్ సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోతే.. తిరిగి పుంజుకోవడం కష్టం. మొదట బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదు. పాకిస్తాన్ బ్యాటింగ్‌కు వచ్చేసరికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మంచు ప్రభావం కూడా ఉంది. తుది జట్టుపై ఎలాంటి బాధ లేదు. పాక్ గొప్పగా ఆడి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచకప్‌లో ఇది ఆరంభం మాత్రమే.. అంతం కాదు. ఇంకా మాకు మ్యాచులు ఉన్నాయి. విజయం సాధిస్తాం' అని ధీమా వ్యక్తం చేశాడు.