హైదరాబాద్: గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలన్న తన తండ్రి కోరికను నెరవేర్చాడు టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్. 29 ఏళ్ల ఉమేశ్ యాదవ్ తొలుత కానిస్టేబుల్ ఉద్యోగానికీ ప్రిపేర్ అయ్యాడు. అయితే కానిస్టేబుల్ ఉద్యోగం రాలేదు.
ఏది జరిగినా మన మంచికే అనుకున్నాడు. కానీ ఇప్పుడు భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే తాజాగా తన తండ్రి కోరిక మేరకు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు. టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్‌ని నాగ్‌పూర్ ఆర్బీఐ ఆఫీస్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా నియమించారు.

స్పోర్ట్స్ కోటాలో అతనికీ ఈ ఉద్యోగం దక్కింది. నిజానికి ఛాంపియన్స్ ట్రోఫీకి ముందే ఉమేశ్‌కి ఈ జాబ్ ఆఫర్ వచ్చింది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఇంగ్లాండ్ వెళ్లాల్సి రావడంతో ఉద్యోగంలో చేరలేదు. ఇంగ్లాండ్ వెళ్లడానికి ముందే ఉమేష్ ఆర్బీఐ అధికారులను సైతం కలిశాడు.
అప్పుడే వాళ్లు కూడా అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ఇవ్వడానికి అంగీకరించారు. 2008లో విదర్భకు ఆడే సమయంలో ఉమేశ్ యాదవ్‌కు ఎయిరిండియాతో ఒప్పందం చేసుకున్నాడు. అదే సమయంలో ఎయిరిండియాలో ఉద్యోగం కోసం ఉమేష్ ట్రై చేసినా ఆ సంస్థ అందుకు ఒప్పుకోలేదు. శ్రీలంక పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఉమేశ్ విధులకు హాజరు అవుతాడని అధికారులు తెలిపారు. బిజీ షెడ్యూల్ కారణంగా ఉమేశ్ ఉద్యోగానికి సంబంధించి ఎలాంటి ఫార్మాలిటీస్ పూర్తి చేయలేదన్నారు.
ఎప్పటికైనా ఓ పెద్ద సంస్థలో ఉద్యోగం సంపాదించాలన్న ఉద్దేశంతో ఇన్నాళ్లూ మిగతా ఉద్యోగాల కోసం ప్రయత్నించలేదు. అయితే తాజాగా ఉమేశ్ యాదవ్‌కి ఆర్బీఐ ఉద్యోగం ఇచ్చింది. త్వరలో లంక పర్యటనకు వెళ్లే టీమిండియాలో ఉమేశ్ యాదవ్ చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.