జీవిత కథ రాయనున్న మిథాలీ: వచ్చే ఏడాది అందుబాటులోకి
హైదరాబాద్: భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ఆటో బయోగ్రఫీ రాయనుంది. బ్యాట్ పట్టి మైదానంలో పరుగుల వరద సృష్టించిన మిథాలీ త్వరలోనే తన ఆత్మకథను రాసేందుకు కలం పట్టనుంది. వచ్చే ఏడాది ఆమె ఇందుకు పూనుకోనుంది. ఈ పుస్తకంలో మిథాలీ వ్యక్తిగత, ఆటకు సంబంధించిన చాలా విషయాలను వెల్లడించనుంది.
ఈ పుస్తకానికి సంబంధించిన ప్రచురణ హక్కులను 'పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా' అనే పబ్లికేషన్ సంస్థ దక్కించుకున్నట్టు గురువారం ప్రకటించారు. తన జీవిత చరిత్రను అభిమానులతో పంచుకోవడం ఆనందంగా ఉందని మిథాలీ రాజ్ తెలిపింది. అభిమానులు తన పుస్తకాన్ని ఆదరిస్తారన్న ఆశాభావం వ్యక్తం జేసింది.

మిథాలీ ఆటోబయోగ్రఫీ హక్కులను దక్కించుకున్న పెంగ్విన్ ర్యాండమ్ హౌస్
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా ప్రతినిధులు మాట్లాడారు. 'మిథాలీ ఆటోబయోగ్రఫీ పుస్తకానికి సంబందించిన హక్కులను సొంతం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆమె ఎంతో ప్రతిభ గల క్రీడాకారిణి. ఎన్నో ఆటంకాలను విజయవంతంగా ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకుంది' అని తెలిపారు.

ఎంతో ఆసక్తిగా మిథాలీ
తన వ్యక్తిగత, ఆటకు సంబంధించిన పలు విషయాలను అభిమానులతో పంచుకునేందుకు మిథాలీ కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారని వారు తెలిపారు. వచ్చే ఏడాది ఈ పుస్తకం అందుబాటులోకి రానుందని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. కాగా, ఈ ఏడాది వరల్డ్‌కప్ టోర్నీలో భారత్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లడంలో మిథాలీ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్
మహిళల వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా మిథాలీ చరిత్ర సృష్టించింది. ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మిథాలీ ఈ ఘనత సాధించింది. అత్యధిక పరుగులతో పాటు వన్డే క్రికెట్‌లో 6,000 పరుగులు చేసిన తొలి మహిళా క్రికెటర్ కూడా మిథాలీనే.

16 ఏళ్ల వయసులోనే వన్డేల్లో అరంగేట్రం
16 ఏళ్ల వయసులో 1999లో వన్డేల్లో అరంగేట్రం చేసిన మిథాలీ.. ఐర్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీ చేసింది. ఇప్పటికీ అత్యంత పిన్న వయసులో సెంచరీ చేసిన రికార్డు మిథాలీ పేరిట ఉండటం విశేషం. వన్డేల్లో వరుసగా ఏడు అర్ధ సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌గా మిథాలీ రికార్డు సృష్టించింది.

భారత మహిళల జట్టుకి కెప్టెన్‌గా మిథాలీ
19 వయసులోనే మిథాలీ రాజ్ ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం అందుకుంది. వన్డే అరంగేట్రం చేసిన తర్వాత వరుసగా 15 ఏళ్లు పాటు మిథాలీ యావరేజి 40కి పైగా ఉండటం విశేషం. సచిన్ కూడా సరిగ్గా ఇన్నేళ్ల పాటు 40కి పైగా యావరేజితో పరుగులు చేయడం విశేషం. 2008-12 మధ్యలో ఐదేళ్లు మినహాయిస్తే 2004 నుంచి భారత మహిళల జట్టుకి మిథాలీ కెప్టెన్‌గా కొనసాగుతోంది.

త్వరలో సినిమా కూడా
మిథాలీ రాజ్ జీవితకథకు సంబంధించిన హక్కులను ఇటీవల ప్రముఖ నిర్మాణ సంస్థ వయోకామ్ 18 మోషన్ పిక్చర్స్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మిథాలీ జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కించేందుకు వయోకామ్ 18 మోషన్ పిక్చర్స్ సంస్ధ నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications