హైదరాబాద్: ఇంగ్లాండ్‌తో జరిగిన యూత్ వన్డే కప్ ఆఖరి వన్డే మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో విజయానికి దూరమైన యువ ఆటగాళ్లకు ఇదో గొప్ప అనుభవమని అండర్-19, ఇండియా ఏ కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు. ఐదు వన్డేల సిరిస్‌ను 3-1 ఆధిక్యంతో టీమిండియా దక్కించుకున్న నేపథ్యంలో ద్రవిడ్ గురువారం మీడియాతో మాట్లాడాడు.
ఇంగ్లాండ్ నిర్దేశించిన 227 పరుగుల లక్ష్యఛేదనలో ఆఖరి బంతికి గెలిచే అవకాశాన్ని టీమిండియా చేజేతులా వదులుకుంది. ఈ అనుభవం భవిష్యత్తులో కఠిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఉపయోగపడుతుందని రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నాడు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్లలో 226 పరుగులు చేసింది.

ఆ తర్వాత 227 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ విజయానికి చివరి బంతికి ఒక పరుగు చేయాల్సిన దశలో ఇషాన్ పొరెల్ 6 పరుగుల వద్ద ఇంగ్లాండ్ బౌలర్ వైట్ వేసిన ఫుల్‌టాస్ బంతిని కవర్స్ దిశలో షాట్‌కు ప్రయత్నించి హోల్డెన్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ కావడంతో మ్యాచ్ టైగా ముగిసింది.
'ఇదొక అద్భుతం. వెలకట్టలేని అనుభవం. ఇలాంటి అనుభవాలు ఎదుర్కొంటే భవిష్యత్తులో కుర్రాళ్లు ఇంకా బాగా ఆడతారు. 137-7 స్థితిలో లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ పోరాడిన తీరు అద్భుతం. కొత్త కుర్రాళ్లూ బాగా ఆడారు' అని రాహుల్ ద్రవిడ్ అన్నాడు. యువ బ్యాట్స్‌మెన్ పృద్వీ షాపై ద్రవిడ్ ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించాడు.
అండర్ 19 జట్టులో ఈ విధంగా రాణిస్తే, రాబోయే రోజుల్లో అద్భుతంగా ఆడటంలో ఎటువంటి సందేహాం లేదని ద్రవిడ్ పేర్కొన్నాడు. ఈ సిరిస్‌లో షా తొలుత విఫలమైనప్పటికీ, ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్నాడని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు. ఇక, రెండు సెంచరీలు, అద్భుతమైన బ్యాటింగ్‌తో శుభమ్ గిల్ ఆకట్టుకొన్నాడని ద్రవిడ్ అన్నాడు. హిమాన్షు రాణా చక్కగా బ్యాటింగ్ చేశాడని పేర్కొన్నాడు.