హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కోరుకున్న వ్యక్తినే కోచ్‌గా బీసీసీఐ ప్రకటించింది. దీంతో కోచ్ ఎంపిక విషయంలో తన పంతాన్ని నెగ్గించుకున్నాడు కోహ్లీ. నిజానికి గతేడాది రవిశాస్త్రిని కోచ్ కాకుండా అడ్డుకోవడంలో విజయవంతమైన గంగూలీ, ఈసారి కోచ్ పదవికి రవిశాస్త్రికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న అంశం ఆసక్తిగా మారింది.
కొత్త కోచ్ ఎంపిక అనేది క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) చేతుల్లో ఉండటం... దానికి ఛీప్‌గా సౌరవ్ గంగూలీ కావడంతో రవిశాస్త్రికి ఈసారి కూడా కోచ్ పదవి దక్కడం కష్టమేనన్న అభిప్రాయాలు సోమవారం ఇంటర్వ్యూలు ముగిసిన అనంతరం వ్యక్తమయ్యాయి. రవిశాస్త్రి కంటే రేసులో సెహ్వాగ్ ముందున్నాడంటూ వార్తలు కూడా వచ్చాయి.

తన ప్రజెంటేషన్‌తో సెహ్వాగ్ సీఏసీని మెప్పించాడని, సెహ్వాగ్‌కే కోచ్ పదవి దక్కుతుందనే వార్త బలంగా వినిపించింది. అయితే అత్యంత నాటకీయ పరిణామాల మధ్య మంగళవారం రాత్రి కోహ్లీ కోరుకున్న రవిశాస్త్రినే కోచ్‌గా నియమిస్తూ బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది. నిజానికి ఈసారి కూడా రవిశాస్త్రికి కోచ్ పదవి దక్కకుండా గంగూలీ గట్టిగానే ప్రయత్నించాడు.
రవిశాస్త్రి పేరుని గంగూలీ తీవ్రంగా వ్యతిరేకించినట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి. కానీ సీఏసీలో సభ్యుడిగా ఉన్న సచిన్ టెండూల్కర్ ఒత్తిడి మేరకు గంగూలీ వెనక్కి తగ్గినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. కోహ్లీతో పాటు జట్టులోని ఆటగాళ్లు రవిశాస్త్రి విషయంలో సానుకూలంగా ఉన్నారన్న విషయాన్ని సచిన్ దాదాకు వివరించాడు.
అంతేకాదు జట్టు నిర్ణయాన్ని గౌరవించాల్సిన బాధ్యత మనపై ఉందని, జట్టు కోరుకున్న వ్యక్తినే కోచ్‌గా ఇవ్వడం కరెక్ట్ అని సచిన్ చెప్పడంతో గంగూలీ అంగీకరించాడంట. అయితే కోచ్ పదవిలో తన మాట నెగ్గకపోయినా.. బౌలింగ్ కోచ్ విషయంలో మాత్రం రవిశాస్త్రి కోరుకున్న భరత్ అరుణ్‌ను కాదని జహీర్ ఖాన్ పేరుని తెరపైకి తీసుకొచ్చాడు.
అతన్ని బౌలింగ్ కోచ్‌గా నియమించడానికి అంగీకరిస్తేనే, రవిశాస్త్రిని ప్రధాన కోచ్‌గా ఎంపిక చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తానని గంగూలీ మెలిక పెట్టాడంట. జహీర్‌కి ఉన్న అనుభవం, ఇప్పుడున్న టీమ్‌తో ఉన్న మంచి సంబంధాల కారణంగా అతని పేరును ఎవరూ వ్యతిరేకించలేక పోయారు. సచిన్, లక్ష్మణ్ సరే అన్నారు.
దీంతో ప్రస్తుతం వెస్టిండిస్ పర్యటనలో ఉన్న జహీర్ ఖాన్‌తో బోర్డు జీఎం ఎంవీ శ్రీధర్, సీఈవో రాహుల్ జోహ్రి మాట్లాడారు. దీంతో పాటు విదేశీ పర్యటనల్లో ప్రత్యేకంగా బ్యాటింగ్ కన్సల్టెంట్ అంటూ ద్రవిడ్‌ను నియమించాడు. జహీర్, ద్రవిడ్‌లను నియమించి రవిశాస్త్రి పాత్రను సీఏసీ పరిమితం చేసిందని కామెంటేటర్ హర్షా భోగ్లే ట్వీట్ చేశాడు.