హైదరాబాద్: మైదానంలో మెరుపు ఫీల్డింగ్ వల్లే మూడో టీ20లో విజయం సాధించామని భారత ప్రధాన కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నాడు. తిరువనంతపురం వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మూడో టీ20లో న్యూజిలాండ్‌పై భారత 6 పరుగుల తేడాతో విజయం సాధించి తొలిసారి న్యూజిలాండ్‌పై కోహ్లీసేన టీ20 సిరిస్‌ను సొంతం చేసుకుంది.
ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ కివీస్‌పై టీ20 మ్యాచ్‌నే గెలవని భారత్... తాను కోచ్ అయ్యాక 2-1తో సిరీస్ సాధించడంపై హర్షం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కించుకున్న బుమ్రా (2/9) తాను తెలివైన, కీలకమైన ఆటగాడినని నిరూపించుకున్నాడని ప్రశంసల వర్షం కురిపించాడు.

ప్రత్యర్థి జట్టుకు ఏ మాత్రం అవకాశాన్ని బుమ్రా ఇవ్వలేదని అన్నాడు. 'భారత్ ఇన్నింగ్స్ ముగిశాక.. ఆ స్కోరు కాపాడుకోగలమని భావించాం. మైదానంలో మెరుపు ఫీల్డింగ్ వల్లే మూడో టీ20లో విజయం సాధ్యమైంది. ఒత్తిడి లేకుండా ఆడామని ఎవరైనా అంటే అది కచ్చితంగా అబద్ధం చెప్పినట్లే. ఇంత తక్కువ ఓవర్ల మ్యాచ్‌లలో 2-3 బంతుల్లోనే పరిస్థితులు మారిపోయే ఛాన్స్ ఉంది' అని రవిశాస్త్రి అన్నాడు.
'వెనువెంటనే ఓపెనర్లు ఔటవ్వగా 65 పరుగులు చేస్తే చాలనుకున్నాం. ఆరంభంలో వేగంగా పరుగులు చేస్తే ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెరుగుతోంది. మైదానంలో పాదరసంలా కదులుతూ అద్భుతంగా క్యాచ్‌లు పట్టడంతో పాటు పరుగులు నియంత్రించడంలో ఆటగాళ్లు సక్కెస్ అయ్యారు. ఒత్తిడిలోనూ కోహ్లీ సేననే విజయం వరించింది. తొలిసారి కివీస్‌పై టీ20 మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను నెగ్గినందుకు చాలా సంతోషంగా ఉంది' అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.