ఐపీఎల్ కన్నా దేశానికే ప్రాధాన్యం: ఢిల్లీ మెంటార్‌గా తప్పుకున్న ద్రవిడ్
హైదరాబాద్: దేశం పట్ల తనుకున్న అంకితభావాన్ని క్రికెట్ లెజెండ్ రాహుల్ ద్రవిడ్ మారోమారు నిరూపించుకున్నాడు. కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ కంటే దేశానికే ప్రాధాన్యమిచ్చాడు. విరుద్ధ ప్రయోజనాల ఆరోపణల నేపథ్యంలో ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు గుడ్‌బై చెప్పి ఇండియా ఏ, అండర్-19 జట్లకు కోచ్‌గా కొనసాగేందుకే ద్రవిడ్ మొగ్గుచూపాడు.
ఇండియా ఏ, అండర్-19 జట్లకు కోచ్‌గా ఉంటూ ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు మెంటార్‌గా బాధ్యతలు నిర్వర్తించడం విరుద్ధ ప్రయోజనాల కిందికి వస్తుందంటూ బీసీసీఐ పాలక కమిటీ మాజీ సభ్యుడు రామచంద్ర గుహ అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఐపీఎల్‌తో ద్రవిడ్ తన బంధాన్ని తెంచుకున్నాడు.
రాహుల్ ద్రవిడ్ 2015లో భారత్-ఎ, అండర్-19 జట్లకు కోచ్‌గా నియమితుడయ్యాడు. ఇటీవలే కోచ్‌గా ద్రవిడ్ పదవీ కాలం ముగిసింది. కోచ్‌గా ద్రవిడ్ బాధ్యతలు చేపట్టాక యువ ఆటగాళ్లతో కూడిన ఇండియా ఏ, అండర్-19 జట్లు చక్కటి ఫలితాలు కనబర్చాయి. ద్రవిడ్ శిక్షణలో అనేకమంది యువ ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు.

ద్రవిడ్ పనితీరుపై బీసీసీఐ సంతృప్తి
ద్రవిడ్ పనితీరుపై బీసీసీఐతో పాటు సచిన్, గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌లతో కూడిన క్రికెట్ సలహా కమిటీ కూడా పూర్తి సంతృప్తితో ఉంది. ద్రవిడ్ పదవీ కాలం పొడిగింపు విషయం జూన్ నెల మొదట్లో జరిగిన బీసీసీఐ జనరల్ బాడీ మీటింగ్‌లో కూడా చర్చకు వచ్చింది.

విరుద్ధ ప్రయోజనాల అంశంపై స్పష్టత కోరిన ద్రవిడ్
ఈ నేపథ్యంలో ఈసారి కోచ్‌గా బాధ్యతలు చేపట్టే ముందు విరుద్ధ ప్రయోజనాల అంశంపై స్పష్టత ఇవ్వాలని ద్రవిడ్ బోర్డుని సైతం కోరుతూ ఓ లేఖ రాశాడు. డేర్‌డెవిల్స్ మెంటార్ పదవిని వదులుకోక తప్పని పక్షంలో తనకు జరిగే నష్టాన్ని భర్తీ చేయాల్సి ఉంటుందని కూడా ద్రవిడ్ బోర్డుకు షరతు విధించినట్లుగా వార్తలొచ్చాయి.

బోర్డు సైతం సానుకూలంగా
ఢిల్లీ డేర్ డెవిల్స్ మెంటార్ పదవిని ద్రవిడ్ కోల్పోతున్న తరుణంలో అందుకు తగిన విధంగా ద్రవిడ్‌కు న్యాయం చేసేందుకు బోర్డు కూడా సానుకూలంగానే స్పందించింది. గత ఒప్పందంతో పోలిస్తే ఈసారి ద్రవిడ్‌కి జీతంలో పెద్దమొత్తంలో పెంచింది. 2015లో తొలుత చేసుకున్న 10 నెలల కోచ్ పదవికి గాను బీసీసీఐ రాహుల్ ద్రవిడ్‌కి సుమారు రూ.4 కోట్లను వేతనంగా ఇచ్చింది.

తాజా ఒప్పందంతో ద్రవిడ్‌కి పెద్ద మొత్తంలో జీతం
తాజా ఒప్పందంతో ద్రవిడ్‌కి ఇంకా పెద్ద మొత్తంలో అందుతుంది. ఈ నేపథ్యంలో భారత్-ఎ, అండర్-19 జట్లకు కోచ్‌గా రాహుల్ ద్రావిడ్‌నే కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయించింది. మరో రెండేళ్ల పాటు ద్రావిడ్‌నే కొనసాగిస్తున్నట్టు బోర్డు శుక్రవారం వెల్లడించింది. ఈ క్రమంలో మరో రెండేళ్ల పాటు భారత ఎ, అండర్-19 జట్లకు రాహుల్ చీఫ్ కోచ్‌గా వ్యహరిస్తాడని శుక్రవారం బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.

బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా ఇలా
ద్రవిడ్ పునర్నియామకంపై బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా మాట్లాడారు. ‘గత రెండేళ్లుగా యువ ప్రతిభను వెలికితీయడంలో ద్రావిడ్ కీలకపాత్ర పోషించాడు. కాబట్టి మరో రెండేళ్లపాటు అతన్నే కొనసాగించాలని భావిస్తున్నాం. అతని శిక్షణలో మరెందరో యువ క్రికెటర్లు భారత క్రికెట్‌కు పరిచయం అవుతారని ఆశిస్తున్నామ'ని బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా తెలిపాడు.

ద్రవిడ్ నిబద్ధత, అంకితభావంపై బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి
బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి కూడా ద్రవిడ్ నిబద్ధత, అంకితభావాన్ని ప్రశంసించాడు. క్రమశిక్షణకు మారుపేరని అన్నాడు. అతని శిక్షణలో యువ భారత్ స్వదేశం, విదేశాల్లోనూ మెరుగైన ఫలితాలు సాధించింది. ద్రావిడ్ కోచింగ్‌లో భారత్-ఎ జట్టు తొలుత ఆస్ర్టేలియాలో జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. అండర్-19 జట్టు కూడా 2016 వరల్డ్‌కప్‌లో రన్నరప్‌గా నిలిచింది.
మెంటార్ పదవి నుంచి తప్పుకోవడంపై డేర్ డెవిల్స్ ఇలా
మరోవైపు ద్రవిడ్ డేర్‌డెవిల్స్ మెంటార్ పదవి నుంచి తప్పుకోవడంపై ఆ ఫ్రాంఛైజీ యాజమాన్యం నిరాశ వ్యక్తం చేసింది. ఇది తమకు విచారకరమైన పరిణామమని పేర్కొంది. ద్రవిడ్ రెండేళ్ల పాటు డేర్‌డెవిల్స్ జట్టుతో ఉన్నాడు. అక్కడ అతను యువ ప్రతిభను బాగా ప్రోత్సహించాడు. అతడి హయాంలో రిషబ్ పంత్, సంజు శాంసన్ లాంటి కుర్రాళ్లు జట్టులో కీలక ఆటగాళ్లుగా ఎదిగిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications