
డర్బన్: ప్రపంచకప్‌కు ముందు భారత యువ జట్టు సత్తాచాటింది. నాలుగు దేశాల అండర్-19 వన్డే టోర్నీని భారత అండర్-19 జట్టు కైవసం చేసుకుంది. గురువారం జరిగిన ఫైనల్లో భారత జట్టు 69 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా అండర్-19 జట్టుపై గెలిచింది. బ్యాటింగ్‌లో ధ్రువ్ జురెల్ (115 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 101), తిలక్ వర్మ (103 బం తుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో 70).. బౌలింగ్‌లో స్పిన్నర్ అంకోలేకర్ (4/31) చెలరేగడంతో భారత అండర్-19 జట్టు సునాయాస విజయాన్ని అందుకుంది.
టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 259 పరుగులు చేసింది. ఆరంభంలో గెరాల్డ్ కోయిజే (3/19) విజృంభించడంతో యశస్వి జైస్వాల్ (0), దివ్యాన్ష్ సక్సేనా (6), కెప్టెన్ ప్రియమ్ గార్గ్ (2) వెంట వెంటనే పెవిలియన్‌కు చేరారు. దీంతో భారత్ 13 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ, ధ్రువ్ జురెల్ బాధ్యత తీసుకున్నారు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 164 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక సిద్ధేశ్ వీర్ (37 బంతుల్లో 48; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడటంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు చేసింది.
లక్ష్య చేధనకు దిగిన దక్షిణాఫ్రికాను అథర్వ అన్కోలేకర్ (4/31) హడలెత్తించడంతో ఆ జట్టు 43.1 ఓవర్లలో 190 పరుగులకే ఆలౌట్ అయింది. జాక్ లీస్ (52; 4 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బర్డ్ (39), వాన్ ఊరెన్ (24) పర్లేదనిపించారు. బౌలింగ్‌లోనూ రాణించిన తిలక్ వర్మ కీలకమైన ఓపెనర్ ఆండ్రూ లోవ్ (17; 3 ఫోర్లు) వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. రవి బిష్ణోయ్ (2/29) రెండు.. తిలక్ వర్మ, ఆకాశ్ సింగ్, యశస్వీ జైస్వాల్, సిద్ధేష్ వీర్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
గత సెప్టెంబరులో కొలంబోలో బంగ్లాదేశ్‌తో జరిగిన అండర్-19 ఆసియా కప్ ఫైనల్లోనూ అంకోలేకర్ 5 వికెట్లు తీసి జట్టును విజేతగా నిలిపాడు. జురెల్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. టోర్నీ మొత్తం రాణించిన హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ 'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్' అవార్డును సొంతం చేసుకున్నాడు. న్యూజిలాండ్, జింబాబ్వే ఈ సిరీస్‌లో పాల్గొన్న మిగిలిన రెండు జట్లు.