
హైదరాబాద్: ఐపీఎల్11లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించిన అఫ్ఘాన్ సంచలనం రషీద్ ఖాన్.. పౌరసత్వంపై చర్చ మొదలైంది. అద్భుత లెగ్ స్పిన్‌కు తోడు, మెరుపు బ్యాటింగ్.. ఫీల్డింగ్‌తో ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్న అతడికి భారత క్రికెట్ అభిమానులు ఫిదా అయిపోయారు. దీంతో కొందరు అభిమానులు రషీద్‌కు భారత పౌరసత్వం ఇచ్చి.. టీమిండియాలోకి తీసుకోవాలని సోషల్ మీడియాలో పెద్ద దుమారం సృష్టించారు.
అంతేకాదు మరికొందరైతే ఒక అడుగు ముందకేసి.. రషీద్‌కు భారత పౌరసత్వం ఇప్పించాలని విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి సుష్మా స్వరాజ్‌ను కోరారు. కావాలంటే రవీంద్ర జడేజాను ఇచ్చేసి రషీద్‌ను టీమిండియాలోకి తీసుకునేలా అఫ్ఘాన్ బోర్డుతో ఒప్పందం కుదుర్చుకోవాలని బీసీసీఐకి సలహా కూడా ఇచ్చారు. దీనిపై సుష్మస్వరాజ్‌తో పాటు, అఫ్ఘాన్ అధ్యక్షుడు కూడా స్పందించారు.
సుష్మ స్వరాజ్.. ఈ విషయం పూర్తిగా రక్షణ వ్యవహారాల శాఖకు సంబంధించినదని ట్వీట్ చేసి తర్వాత తొలగించారు. అయితే అభిమానులు అడిగిన అభ్యర్థనకు అఫ్ఘాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ అతీఫ్ మషల్ చేసిన ఓ ట్వీట్‌తో బదులిచ్చాడు. 'రషీద్ ఖాన్ కోసం ఆఫర్ చేస్తున్నవారందికి థ్యాంక్స్. ప్రపంచ వ్యాప్తంగా అతడికెంత డిమాండ్ ఉందో మాకూ తెలుసు. కానీ, అతడు ఎక్కడికీ వెళ్లడు. ఎందుకంటే.. అతడు అఫ్ఘాన్ దేశస్థుడిగానే గర్వపడుతున్నాడు' అని ట్వీట్ చేశాడు.
దీనిపై స్పందించిన రషీద్ ఖాన్ 'అవును. ఖచ్చితంగా.. మిస్టర్ చైర్మన్. అఫ్ఘాన్ పౌరుడిగా గర్వపడుతున్నాను. ఎప్పటికీ ఇక్కడే ఉంటాను. అఫ్ఘనిస్థాన్ దేశం కోసం పోరాడుతాను. మేము శాంతిని వ్యాప్తి చేయాలనుకుంటున్నాం.. ఎందుకంటే అది మా దేశానికి చాలా అవసరం'' అంటూ రషీద్ బదులిచ్చాడు.
ఇటీవలే క్రికెట్ జరుగుతుండగా నాన్‌గర్హర్ ప్రాంతంలో బాంబు పేలి పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో రషీద్ ఖాన్ ప్రాణ స్నేహితుడు, ఆ క్రికెట్ టోర్నీ నిర్వహకుడైన హిదాయతుల్లా కూడా ఉన్నాడు.