హైదరాబాద్: తాజాగా బీసీసీఐ కూడా ఆటగాళ్లకు పారితోషకాలను విడుదల చేసింది. క్రికెటర్లతో పాటు కామెంటేటర్లు, రాష్ట్ర సంఘాలకు కూడా ఎంతెంత మనీ విడుదల చేసిందో బీసీసీఐ వెబ్ సైట్‌లో వివరించింది. కాగా క్రికెటర్లకు అందజేసిన పారితోషక జాబితాలో మాత్రం కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు.
2015-16 సంవత్సరానికి ఆటగాళ్లకు బీసీసీఐ ఇచ్చిన పారితోషకాలు వివరాలను వెల్లడించింది. సొంతగడ్డపై న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లకు సంబంధించిన మ్యాచ్ ఫీజుల వివరాలను బీసీసీఐ విడుదల చేసింది.

ఓపెనర్ శిఖర్ ధావన్ అత్యధికంగా రూ.87.76 లక్షలు అందుకోగా, కెప్టన్ కోహ్లీ రూ.83.07 లక్షలు అందుకున్నాడు. ఇక టీమిండియా టెస్టు జట్టు వైస్ కెప్టెన్ రహానె రూ.81.06 లక్షలు పొందాడు. మరో ఓపెనర్ రోహిత్‌శర్మ, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తలో రూ. 73.02 లక్షలు అందుకున్నారు.
ఆటగాళ్లు అందుకున్న మొత్తానికి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరంలేదని కూడా బీసీసీఐ నిర్వాహకులు తెలిపారు. ఇదిలా ఉంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్‌లో గాయం కారణంగా టోర్నీ మధ్యలో వైదొలిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ఆశిష్ నెహ్రా గాయం పరిహారం కింద రూ. 1.52 కోట్లు బీసీసీఐ నుంచి అందుకున్నాడు.
కాగా, ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక పారితోషకాన్ని అందుకుంటున్న టాప్ 100 అథ్లెట్ల జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చోటు దక్కించుకున్నాడు. ఫోర్బ్స్ ప్రకటించిన ఈ జాబితాలో భారత్ నుంచి కోహ్లీ ఒక్కడికే చోటు దక్కడం విశేషం.