India vs West indies: ఓపెనర్‌గా ఇషాన్ కిషన్.. తుది జట్టుపై క్లారిటీ ఇచ్చిన రోహిత్ శర్మ

కరోనా కారణంగా ఓపెనర్లు శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్ ఐసోలేషన్‌లో ఉండడంతో వెస్టిండీస్‌తో తొలి వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మకు జతగా ఎవరు ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నారనే విషయమై సందిగ్ధం నెలకొంది. దీనికి తోడు అదనపు ప్లేయర్‌గా జట్టులో చేర్చిన మయాంక్ అగర్వాల్ ఇంకా క్వారంటైన్‌లోనే ఉన్నాడు. అయితే తాజాగా ఈ సందిగ్ధానికి కెప్టెన్ రోహిత్ శర్మ తెరదించాడు. అలాగే వెస్టిండీస్‌తో తొలి వన్డేలో బరిలోకి దిగబోయే టీమిండియా తుది జట్టుపై కూడా క్లారిటీ ఇచ్చాడు.

కోహ్లీవి, నావి ఆలోచనలు ఒకేలా ఉంటాయి
కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఎక్కడైతే నిష్క్రమించాడో తాను అక్కడి నుంచి మొదలుపెడతానని హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ తెలిపాడు. కోహ్లీ కెప్టెన్సీలో ఆడిన ఆటను ఇప్పుడు కూడా కొనసాగిస్తామని అన్నాడు. ఒక ఆటగాడిగా తన నుంచి జట్టు ఏం ఆశిస్తుందో కోహ్లీకి తెలుసని చెప్పాడు. ఇక విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నపుడు తాను వైస్ కెప్టెన్‌గా ఉన్నానని ఆయన గుర్తు చేశాడు. తమ ఇద్దరి ఆలోచనలు దాదాపు ఒకే విధంగా ఉంటాయని చెప్పుకొచ్చాడు. పరిస్థితులకు తగ్గట్లుగా ఆటగాళ్లు తమను తాము మలచుకోవాలని సూచించాడు. ప్రస్తుతం తాను పెద్దగా మార్పులు చేయాల్సిన అవసరం లేదని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

దక్షిణాఫ్రికా ఓటమి గుణపాఠం
ఇక దక్షిణాఫ్రికా పర్యటనలో ఎదురైన క్లీన్ స్వీప్ ఓటమి తమకు గుణ పాఠం లాంటిదని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఆటగాళ్లు ఒక్కొక్కరితో మాట్లాడి జట్టును పటిష్టం చేసుకుంటామని చెప్పుకొచ్చాడు. కాగా సౌతాఫ్రికా పర్యటలో రోహిత్ శర్మ గైర్హాజరీలో 3 వన్డే మ్యాచ్‌ల సిరీస్ ఆడిన టీమిండియా 0-3 తేడాతో ఓటిమి పాలైన సంగతి తెలిసిందే.

70% పైగా విజయాలు
గత కొన్నేళ్లుగా టీమిండియా 70 శాతానికి పైగా విజయాలు సాధించిందని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. దీంతో ప్రస్తుతం తమను తాము మార్చుకోవాల్సిన అవసరం అంతగా లేదని చెప్పుకొచ్చాడు. అయితే కొన్ని సందర్భాల్లో తమ ఆటను మార్చుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయని అన్నాడు. వేర్వేరు సమయాల్లో విభిన్నమైన పనులను చేయడానికి సిద్ధంగా ఉండాలని రోహిత్ తెలిపాడు. అలాగే ప్రస్తుత వెస్టిండీస్ సిరీస్‌లో స్పిన్ ద్వయం కుల్దీప్ యాదవ్, యజుర్వేంద్ర చాహల్ ద్వయం తమకు విజయాలు అందిస్తుందని హిట్‌మ్యాన్ ఆశాభావం వ్యక్తం చేశాడు

భారత అండర్ 19 జట్టుకు శుభాకాంక్షలు
xఅలాగే వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్ చేరిన టీమిండియా అండర్ 19 జట్టుకు రోహిత్ శర్మ శుభాకాంక్షలు తెలిపాడు. ఫైనల్‌లో గెలవాలని ఆకాంక్షించాడు. టీమిండియా అండర్ 19 జట్టు బాగా ఆడుతుందని కొనియాడాడు. ఐసీసీ టోర్నీలలో సరైన ప్రణాళిక ముఖ్యమని చెప్పాడు. కాగా బెంగళూరులోని ఎన్‌సీఏ అకాడమీలో టీమిండియా అండర్ 19 జట్టుతో తాను మాట్లాడినట్లు రోహిత్ తెలిపాడు.

భారత తుది జట్టు (అంచనా)
ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్/ కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్/ దీపక్ చాహర్, చాహల్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications