
మొహాలీ: టెస్టు ఫార్మాట్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచిన టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. రవిచంద్రన్ అశ్విన్ ఆల్‌టైమ్ గ్రేట్ అంటూ కొనియాడాడు. అశ్విన్ ఈ రికార్డు సాధించడం గొప్ప విషయం అని, అతడిని చాలా ఏళ్లుగా గమనిస్తున్నానని, ప్రతిసారి మెరుగవుతూనే ఉన్నాడని హిట్‌మ్యాన్ చెప్పుకొచ్చాడు. వ్యక్తిగతంగానే కాకుండా జట్టుకు కూడా రికార్డులు అందించే సత్తా అశ్విన్‌లో ఉందని రోహిత్ ప్రశంసించాడు. అశ్విన్ చాలా ఏళ్లుగా జట్టు కోసం ఆడుతూ అనేక విజయాలను అందించాడని గుర్తు చేశాడు. అలాగే వందో టెస్ట్ ఆడుతున్న విరాట్ కోహ్లీ కోసమే ఈ మ్యాచ్ గెలవాలనుకున్నామని రోహిత్ తెలిపాడు.
ఆటగాళ్ల ప్రదర్వన సంతోషాన్నిచ్చిందని, ఇది మంచి ప్రారంభం అని రోహిత్ శర్మ చెప్పాడు. ముందుగా అనుకున్నట్లు తాము అన్ని విభాగాల్లో రాణించామని అన్నాడు. అయితే తొలి టెస్ట్ మ్యాచ్ 3 రోజుల్లోనే ముగుస్తుంది తాను అనుకోలేదని తెలిపాడు. తమ బౌలర్లు సమిష్టిగా రాణించి శ్రీలంక బ్యాటర్లపై ఒత్తిడి పెంచారని అన్నాడు. అలాగే మ్యాచ్‌లో గొప్పగా ఆడి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై కూడా రోహిత్ ప్రశంసలు కురిపించాడు. జడేజా వ్యక్తిగతంగా డబుల్ సెంచరీకి చేరువలో ఉన్నప్పుడు జట్టు కోసం నిస్వార్థంగా స్కోర్‌ను డిక్లేర్ చేద్దామని చెప్పాడని రోహిత్ శర్మ తెలిపాడు.
శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో లంక బ్యాటర్ చరిత్ అసలంకను ఔట్ చేయడం ద్వారా ఈ ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో అశ్విన్ రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో 435 వికెట్లతో 434 వికెట్లు తీసిన కపిల్ దేవ్ రికార్డును అశ్విన్ బద్దలు కొట్టాడు. అశ్విన్ కంటే ముందు 619 వికెట్లతో అనిల్ కుంబ్లే ఉన్నాడు. అశ్విన్ 85 టెస్టు మ్యాచ్‌ల్లోనే ఈ రికార్డును అందుకోవడం గమనార్హం. అలాగే టెస్టు క్రికెట్లో 400కు పైగా వికెట్లు తీసిన నాలుగో భారత బౌలర్ అశ్విన్ అనే సంగతి తెలిసిందే. కాగా ఇదే మ్యాచ్‌లో 431 వికెట్టు తీసిన న్యూజిలాండ్ బౌలర్ రిచర్డ్ హ్యాడ్లీని, 432 వికెట్లు తీసిన శ్రీలంక బౌలర్ రంగనా హెరాత్‌ను సైతం అశ్విన్ అధిగమించాడు.