
హైదరాబాద్: మూడు టెస్టు మ్యాచ్‌ల కోసం కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ప్రస్తుతం దక్షిణాప్రికాలో పర్యటిస్తోంది. ఈ సిరిస్‌లో భాగంగా తొలి టెస్టు కేప్ టౌన్ వేదికగా శుక్రవారం (జనవరి 5)న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తొలి టెస్టు మ్యాచ్‌కి ఐదుగురు పేసర్లతో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తుది జట్టుని ఎంచుకోవాలని లెజెండరీ స్పిన్నర్ ఎర్రాపల్లి ప్రసన్న సూచించారు.
ఈ సుదీర్ఘమైన సిరిస్ కోసం భారత ఫాస్ట్ బౌలర్లు అయిన భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రాలను జట్టులోకి సెలక్టర్లు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. వీరికి తోడు జట్టులో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అదనపు బౌలర్‌గా ఉన్నాడు.
'ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లు ఉన్న జట్లలో ఒకటిగా ఉంది. గతంలో ఇంతటి పటిష్టమైన బౌలింగ్ లైనప్ టీమిండియాలో ఉందో? లేదో నాకు తెలియదు. కానీ.. గత 60-70 ఏళ్లలో నేను చూసి బెస్ట్ బౌలింగ్ విభాగం ఇదే' అని అన్నాడు.
ఈ పర్యటనకు ముందు వరకు కూడా విరాట్ కోహ్లీ ఐదుగురు బ్యాట్స్‌మెన్, ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లు, ఒక ఆల్‌రౌండర్ కాంబినేషన్‌తో తుది జట్టుని ఎంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎర్రపల్లి ప్రసన్న వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
'టెస్టు మ్యాచ్ గెలవాలంటే కచ్చితంగా జట్టులో ఐదుగురు బౌలర్లు ఉండాలని నేను నమ్ముతా. ఇదే లాజిక్ అదనపు బ్యాట్స్‌మెన్‌ని ఎంచుకునే విషయంతో పాటు బౌలర్ల విషయంలో పాటించాలి. టాప్-5 బ్యాట్స్‌మెన్ విఫలమైనప్పుడు ఆరో స్థానంలో వచ్చే బ్యాట్స్‌మెన్ స్కోరు చేయగలడా? జట్టులో ఐదుగురు బౌలర్లు ఉంటే.. ఇద్దరు విఫలమైనా.. కనీసం ముగ్గురు బౌలర్లు సత్తా చాటగలరు' అని ప్రసన్న వెల్లడించాడు.
ఒక స్పిన్నరే తీసుకోవాల్సి వస్తే రవిచంద్రన్ అశ్విన్ గుడ్ ఛాయిస్ అని తెలిపాడు. 'జడేజాకు వైరల్ ఫీవర్ వచ్చింది కాబట్టి, ఈ కేసులో అశ్విన్‌నే ఎంచుకోవడం ఉత్తమం. అతడు బంతితో పాటు బ్యాట్‌తో కూడా రాణించగలడు' అని పేర్కొన్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.