
సీనియర్ నటిపై క్రష్
బయటకి చెప్పకపోయినా కొందరు క్రికెటర్లు హీరోయిన్‌పై మనసుపడ్డ వారు కూడా ఉన్నారు. ఈ జాబితాలో టీమిండియా సీనియర్ బ్యాట్స్‌మన్, టీ20 స్పెషలిస్ట్ సురేశ్ రైనా ఉన్నాడు. రైనా ఏ బాలీవుడ్ నటితోనూ ప్రేమాయణం నడపలేదు. అలాంటి వార్తలు కూడా బయటకు రాలేదు. అయితే తనకు కూడా ఓ బాలీవుడ్ సీనియర్ నటిపై క్రష్ ఉండేదట. ఆ హీరోయినే సోనాలి బింద్రే. సోనాలి అంటే తనకు క్రష్ అని 'జింగ్ గేమ్ ఆన్' ఎపిసోడ్లో రైనా తెలిపాడు.

సోనాలితో డేట్‌కి వెళ్లాలనుండే
తాజా 'జింగ్ గేమ్ ఆన్' ఎపిసోడ్లో రైనా క్రికెట్, సంగీతం, సెలబ్రిటీల క్రష్ గురించి మాట్లాడాడు. 'నా కాలేజీ రోజుల్లో సోనాలి బింద్రే అంటే క్రష్ ఉండేది. ఆమెతో డేట్‌కి వెళ్లాలనుండే. ఈ విషయం ఎవరికీ తెలియదు' అని రైనా చెప్పుకొచ్చాడు. కోరిక నెరవేరలేకపోయినా.. ఓ సారి మాత్రం సోనాలి నుంచి స్పెషల్ మెసేజ్ వచ్చిందని చెప్పాడు. ఆ మెసేజ్ చూసి ఆశ్చర్యపోయా అని కూడా రైనా తెలిపాడు.

ఆమె రాకతో నా జీవితమంతా మారిపోయింది
రైనా తన 4 సంవత్సరాల కుమార్తె గురించి కూడా మాట్లాడాడు. 'నా కుమార్తె నాకు పెద్ద మద్దతుదారు. ఆమె రాకతో నా జీవితమంతా మారిపోయింది. నేను ఆమెతో పంచుకునే చిన్న చిన్న క్షణాలు చాలా విలువైనవి. తొలి రోజు నుండి నా కూతురు నా పక్షాన ఉంది. ఆమె నా ట్రావెల్, జిమ్ బడ్డీ. నా భార్య, నేను ఎక్కడికివెళ్ళినా (వర్కవుట్స్, సైక్లింగ్, షాపింగ్, ఆహార వస్తువులు) మాతో పాటే వస్తుంటుంది' అని రైనా కుమార్తె గురించి చెపుతూ సంబరపడిపోయారు.

రెండోసారి సర్జరీ:
మోకాలి గాయానికి గత ఏడాది ఆగస్టులో నెదర్లాండ్స్‌లోని అమస్టర్‌డామ్‌లో సురేశ్ రైనా రెండోసారి సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి క్రికెట్‌కి దూరంగా ఉంటున్నాడు. ఇటీవలే ఫిట్నెస్ సాధించేందుకు తీవ్రంగా శ్రమించాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ట్రైనర్ గ్రేమ్ కింగ్ పర్యవేక్షణలో ఫిట్నెస్ సాధించాడు. ఐపీఎల్ 2020 సీజన్లో మంచి ప్రదర్శన చేసి ఈ ఏడాది అక్టోబరులో జరిగే టీ20 ప్రపంచకప్‌కి టీమిండియాలో చోటు దక్కించుకోవాలని రైనా ఆశిస్తున్నాడు.

18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20లు:
భారత్ తరఫున రైనా 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. గత ఏడాది జూలైలో చివరిగా వన్డే ఆడిన రైనా.. ఆ తర్వాత పేలవ ఫామ్ కారణంగా జట్టులో చోటు కోల్పోయాడు. కానీ దేశవాళీ క్రికెట్లో తరచుగా మ్యాచ్‌లు ఆడుతున్న రైనా.. ఐపీఎల్-12 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున సత్తాచాటాడు. ఆపై గాయం కారణంగా ఆటకు చాలా నెలలు దూరమయ్యాడు.