కోల్‌కతా: టీ20 ప్రపంచ కప్ టోర్నీలో ఇప్పటికే న్యూజీలాండ్ చేతిలో ఓడిపోయిన భారత్‌పైనే ఒత్తిడి అధికంగా ఉంటుందని పాకిస్థాన్ టీం కోచ్ వకార్ యూనిస్ అన్నాడు. పాక్ ఇప్పటికే బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించి ఆధిక్యంలో ఉంది కాబట్టి తమపై అంతగా ఒత్తిడి లేదని ఆయన చెప్పాడు.
శనివారం భారత్‌తో టీ20 వరల్డ్ కప్‌లో తలపడనున్న నేపథ్యంలో కోల్ కతాలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడు గెలవాలనే ఒత్తిడి టీమిండియాపై ఉందని అన్నాడు. భారత్-పాక్ జట్ల మధ్య మ్యాచ్ అంటే ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తుందని వకార్ పేర్కొన్నాడు.
న్యూజిలాండ్ చేతిలో ఓటమితో భారత్ పై ఒత్తిడి పెరిగిందని వకార్ అభిప్రాయపడ్డాడు. కోల్ కతాలో మైదానంలో, మైదానం బయట అభిమానుల మద్దతు బాగుందని వకార్ వెల్లడించాడు.

రేపటి మ్యాచ్‌లో టీమిండియా బలహీనతల గురించి ఆలోచించడం లేదని, తమ జట్టు బలాలపై దృష్టిసారించామని వకార్ యూనిస్ తెలిపాడు. భారత్‌పై గెలుపొంది చరిత్ర సృష్టిస్తామని చెప్పాడు.
కాగా, గత మ్యాచ్‌లో కూడా ఒత్తిడికి గురికాలేదని భారత బౌలర్ అశ్విన్ తెలిపారు. తాము ఒత్తిడిని అదుపుచేసుకోగలమని చెప్పారు. ఇకపై ఆడబోయే ప్రతీ మ్యాచూ భారత్ గెలవాల్సిందేనన్నారు. భారత్-పాక్ మ్యాచ్‌ను ఫ్యాన్స్ ఓ ఆటలా కాకుండా సరిహద్దులో యుద్ధం జరుగుతున్నట్లుగా చూస్తారని అశ్విన్ చెప్పారు. అయితే ఇలాంటి భావోద్వేగాలను పక్కనపెట్టి తాము మ్యాచ్‌పైనే దృష్టి సారిస్తామని చెప్పారు.