
భారత్ బాగా బ్యాటింగ్ చేసింది:
తాజాగా మైఖేల్ వాన్ మాట్లాడుతూ... 'నాలుగో టెస్టులో ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో విఫలమైంది. కొన్ని మంచి క్యాచులు నేలపాలు చేయడంతో మొదలైన ఈ వైఫల్యం బ్యాటింగ్, బౌలింగ్ చేయడంలోనూ స్పష్టంగా కనిపించింది. రెండో ఇన్నింగ్స్‌లో బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. వికెట్లు తీసేందుకు చాలా కష్టపడ్డారు. భారత్ బాగా బ్యాటింగ్ చేసింది. గత రెండు సంవత్సరాలుగా ఇంగ్లండ్ ఫీల్డింగ్ మెరుగుపడలేదు. తరుచుగా క్యాచులు వదిలేస్తూ విజయానికి దూరమవుతోంది. నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 125 పరుగులకే భారత్‌ని కట్టడి చేసే అవకాశం వచ్చినా.. క్యాచులు వదిలేయడంతో ఆ జట్టు 191 పరుగులు చేయగలిగింది' అని అన్నాడు.

పిచ్‌పై ఆధారపడుతున్నారు:
'ఓవల్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ భారీ పరుగులు చేయలేకపోయింది. బ్యాట్స్‌మెన్ ఏకాగ్రత లోపించి చెత్త షాట్లు ఆడుతున్నారు. ఓపెనర్ హసిబ్ హమీద్ వైడ్ బాల్ని వేటాడి ఔట్ అయ్యాడు. మొయిన్ అలీ అనవసర షాట్ ఆడి ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఇంగ్లండ్ పేస్ బౌలింగ్‌లో కూడా కొత్తదనం లోపించింది. ఆటగాళ్లు ఎక్కువగా పిచ్‌పై ఆధారపడుతున్నారు. పిచ్ సహకరిస్తే 20 వికెట్లు తీస్తున్నారు. లేకపోతే పూర్తిగా తేలిపోతున్నారు. బ్యాట్స్‌మెన్ మధ్య సమన్వయం కూడా లోపించింది. డేవిడ్ మలన్ రనౌట్ అవ్వడమే అందుకు ఓ ఉదాహరణ. ప్రత్యర్థి జట్టు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నప్పుడు సింగిల్స్ తీసేందుకు ప్రయత్నించాలి. అయితే హమీద్ సింగిల్‌కు పిలుస్తాడని ఊహించని మలన్.. అనూహ్య రీతిలో రనౌటయ్యాడు' అని వాన్ పేర్కొన్నాడు.

బర్న్స్‌కి వైస్ కెప్టెన్ బాధ్యతలు ఇవ్వాలి:
'ఇంగ్లండ్ జట్టు కూర్పులో కూడా లోపాలున్నాయి. మంచి ఫామ్‌లో ఉన్న మార్క్ వుడ్‌ని పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదు. పరిస్థితులకు అనుగుణంగా తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలి. ఒత్తిడిని ఎలా అధిగమించాలో కూడా రూట్ సేన తెలుసుకోవాలి. రెండు సంవత్సరాలుగా జట్టుకు దూరంగా ఉన్న మొయిన్ అలీని వైస్ కెప్టెన్‌గా నియమించడంతో కొంత గందర గోళానికి గురయ్యాను. అతడు ఇంకా జట్టులో కుదురుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అతడికి బదులుగా.. రెగ్యులర్‌గా టీమ్‌లో ఆడుతున్న రోరీ బర్న్స్‌కి వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించడం ఉత్తమం' అని మైఖేల్ వాన్ అబిప్రాయపడ్డాడు.

టెస్ట్‌ల్లో మాత్రమే:
అంతకుముందు ఓవల్ టెస్ట్‌లో గెలిచిన టీమిండియాపై దిగ్గజ క్రికెటర్లంతా భారత జట్టుపై ప్రశంసల వర్షం కురిపించారు. సచిన్ టెండూల్కర్, ఏబీ డివిలియర్స్, వీరేందర్ సెహ్వాగ్, షేన్ వార్న్, సౌరవ్ గంగూలీ ఇలా చాలా మంది లెజెండరీ క్రికెటర్లు టీమిండియాను ఆకాశానికెత్తుతున్నారు. అయితే ఇది మింగుడు పడని మైఖేల్ వాన్.. గంగూలీ చేసిన ఓ ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ టీమిండియాను పరోక్షంగా ఎగతాళి చేశాడు. 'భారత ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన చేశారు. ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య నైపుణ్యంలో తేడా ఉంది. అతిపెద్ద వ్యత్యాసం ఒత్తిడిని అధిగమించమే. ఈ విషయంలో భారత క్రికెటర్లు ఇతరులతో పోలిస్తే ఎన్నో రేట్లు మేలు' అని దాదా ట్వీటాడు. ఈ ట్వీట్‌పై స్పందించిన ఇంగ్లండ్ మాజీ సారధి వెటకారాన్ని ప్రదర్శిస్తూ టీమిండియాను కవ్విస్తున్నట్లు బదులిచ్చాడు. 'టెస్ట్‌ల్లో మాత్రమే, వైట్ బాల్ క్రికెట్లో కాదు' అంటూ వ్యంగ్యంగా రీట్వీట్ చేశాడు.

ఊహించని మార్పులు:
భారత్‌తో మాంచెస్టర్ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభంకానున్న ఐదో టెస్టు కోసం ఇంగ్లండ్ టీమ్‌ని ఆ జట్టు హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్ మంగళవారం ప్రకటించాడు. 16 మందితో కూడిన ఈ జట్టులోకి వికెట్ కీపర్ జోస్ బట్లర్, ఆఫ్ స్పిన్నర్ జాక్ లీచ్ రీఎంట్రీ ఇచ్చారు. బట్లర్ భార్య ఇటీవల పండంటి ఆడబిడ్డకి జన్మనివ్వడంతో.. నాలుగో టెస్టుకి అతను దూరంగా ఉన్నాడు. మాంచెస్టర్ పిచ్ కాస్త స్పిన్నర్లకు సహకరించే అవకాశం ఉండడంతో లీచ్ జట్టులోకి వచ్చాడు. నాలుగో టెస్టులో వికెట్ కీపర్‌గా ఉన్న జానీ బెయిర్‌స్టో అంచనాల్ని అందుకోలేకపోయాడు. కీపింగ్‌లోనే కాదు.. బ్యాటింగ్‌లోనూ అతడు తేలిపోయాడు. దాంతో ఐదో టెస్టులో బెయిర్‌స్టో ఆడటంపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే ఐదు టెస్టుల సిరీస్‌లో 1-2తో వెనకబడి ఉన్న రూట్ సేన.. సిరీస్ గెలుపు ఆశలు నిలవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంది. దాంతో తుది జట్టులో ఊహించని మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి.

ఇంగ్లండ్ జట్టు:
జో రూట్ (కెప్టెన్), మొయిన్ అలీ, జేమ్స్ అండర్సన్, జానీ బెయిర్‌స్టో, రోరీ బర్న్స్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), సామ్ కరన్, హసీబ్ హమీద్, డాన్ లారెన్స్, జాక్ లీచ్, డేవిడ్ మలాన్, క్రెయిగ్ ఓవర్టన్, ఓలీ పోప్, ఓలీ రాబిన్సన్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్.