
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వరుసగా రెండు మ్యాచుల్లో ఘనవిజయం సాధించిన భారత జట్టు.. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరినట్లే. ఈ సిరీసులో మూడు టెస్టులు గెలిస్తే టీమిండియా.. డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తు ఖరారవుతుందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ రెండు టెస్టులు గెలవడంతోనే భారత్ ఫైనల్ చేరింది. ఇక మిగతా టెస్టుల్లో ఒక్కటి గెలిచినా భారత్ ఫైనల్ చేరడం ఖాయమైపోతుంది. ప్రస్తుతానికైతే న్యూజిల్యాండ్, శ్రీలంక ఆడే రెండు టెస్టుల సిరీస్‌పై భారత్ వెళ్లకపోవడం ఆధారపడి ఉంది.
ఆసీస్‌పై మిగతా రెండు మ్యాచుల్లో భారత్ గెలవకపోయినా కూడా.. శ్రీలంక చేతిలో కివీస్ 2-0తో ఓడితే తప్ప భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడం దాదాపు గ్యారంటీ. ప్రస్తుతం వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారత్ రెండో స్థానంలో ఉంది. భారత్ వద్ద 64.06 శాతం గెలిచిన పాయింట్లు ఉన్నాయి. ఈ పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా వద్ద 66.67 శాతం పాయింట్లు ఉన్నాయి. మూడో స్థానంలో ఉన్న శ్రీలంక వద్ద 53.33 శాతం పాయింట్లు ఉండగా.. నాలుగో స్థానంలోని సౌతాఫ్రికా వద్ద 48.72 శాతం పాయింట్లు ఉన్నాయి.
ఆసీస్‌తో జరిగే రెండు మ్యాచుల్లో భారత్ ఓడితే మళ్లీ సమస్య పెద్దది అవుతుంది. కాబట్టి ఏదో ఒక మ్యాచ్ అయినా భారత్ గెలవాలి, లేదా రెండు మ్యాచులు డ్రా చేసుకోవాలి. గెలిస్తే డైరెక్టుగా ఫైనల్ చేరుతుంది. డబ్ల్యూటీసీ మొదలైన తొలి సీజన్‌లో ఫైనల్ చేరిన భారత్.. ట్రోఫీ మాత్రం అందుకోలేకపోయింది. కాబట్టి వరుసగా రెండో సారి కూడా ఫైనల్ చేరి, ఈసారి ట్రోఫీ ముద్దాడాలని టీమిండియా ఆశిస్తోంది. ఐసీసీ కూడా డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత్, ఆస్ట్రేలియా తలపడే అవకాశం 88.9 శాతం ఉందని చెప్పింది. రెండో టెస్టులో ఆసీస్ ఓడిపోవడంతో ఫైనల్ రేసు నుంచి సౌతాఫ్రికా కూడా తప్పుకుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా, భారత్, శ్రీలంక జట్లు డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తు కోసం పోటీలో ఉన్నాయి. వీటిలో భారత్, ఆస్ట్రేలియానే ఫైనల్ చేరడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఏదో అద్భుతం జరిగితే తప్ప శ్రీలంక ఫైనల్ చేరడం జరగదు.