
ముంబై: టీమిండియా ఆల్‌రౌండర్ శివం దూబే ఓ ఇంటివాడయ్యాడు. గత కొంత కాలంగా తాను ప్రేమిస్తున్న అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. ముంబైలో శివం దూబే అజుమ్ ఖాన్‌ల వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకు రెండు కుటుంబాల నుంచి దగ్గరి బంధువులు సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. తాను ఓ ఇంటివాడినయ్యానన్న వార్తను తన సన్నిహితులకు అభిమానులకు ట్విటర్ ద్వారా తెలిపాడు. "ప్రేమ అనే పదం కంటే ఎక్కువగా ఇద్దరం ప్రేమించుకున్నాం. 16-07-2021న ఇద్దరం ఒక్కటయ్యాం. ఈ క్షణం నుంచి కొత్త జీవితం ప్రారంభించబోతున్నాం" అంటూ శివం దూబే ట్వీట్ చేశాడు.
ఇక శివం దూబే తొలి రంజీ సీజన్‌లో మంచి ప్రదర్శన ఇచ్చాడు. 23మూడు వికెట్లు పడగొట్టి 632 పరుగులు చేశాడు. బ్యాటింగ్‌లో అద్బుతంగా రాణిస్తూ బంతిని బలంగా బాదడంలో దిట్ట అనే పేరును సంపాదించుకోవడంతో ముంబై డొమెస్టిక్ క్రికెట్‌లో తన స్థానంను పదిలం చేసుకున్నాడు శివం దూబే.ఇక 2019లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.5 కోట్లు వెచ్చించి ఈ ఆల్‌రౌండర్‌ను కొనుగోలు చేయడంతో ఒక్కసారిగా తన కెరీర్ మరో మలుపు తీసుకుంది. అయితే ఆ సమయంలో తాను తీసుకున్న చెక్‌కు న్యాయం చేయలేకపోయాడు ఈ యువ ఆల్‌రౌండర్.
ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా పెద్దగా రాణించకపోవడంతో భారత జట్టులో స్థానం సుస్థిరం చేసుకోలేకపోయాడు. ఇక 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌పై అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన శివం దూబే... 13 టీట్వంటీ మ్యాచుల్లో 105 పరుగులు చేసి 5 వికెట్లు తీసుకున్నాడు. ఫిబ్రవరి 2020లో న్యూజిలాండ్ సిరీస్‌లో చివరి సారిగా అంతర్జాతీయ మ్యాచ్‌లో శివం దూబే కనిపించాడు. ఆ తర్వాత ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఈ ఏడాది సస్పెండ్ అయిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఆడాడు. మొత్తం ఆరు మ్యాచ్‌లు ఆడిన శివం దూబే, 145 పరుగులు చేశాడు. ఇందులో అత్యధికంగా 46 పరుగులు చేశాడు. ఇక యూఏఈలో తిరిగి ఐపీఎల్ 2021 ప్రారంభం కానున్న నేపథ్యంలో మంచి ప్రదర్శన కనబరుస్తాడని రాజస్థాన్ రాయల్స్ జట్టు యాజమాన్యం విశ్వసిస్తోంది.