హైదరాబాద్: టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా అభిమానులకు శుభవార్త. గురువారం జడేజా తండ్రి అయ్యాడు. సౌరాష్ట్రకు చెందిన జడేజా ఏప్రిల్ 2016న రాజ్ కోట్‌కు చెందిన రీవా సోలంకీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. జడేజా భార్య సోలంకీ గురువారం ఉదయం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
దీంతో లండన్‌లో ఉన్న జడేజా ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఆ శుభవార్తను జట్టులోని సహచర ఆటగాళ్లతో పంచుకున్నాడు. దీంతో వాళ్లు జడేజాకు శుభాకాంక్షలు తెలిపారు. జడేజా భార్య రీవా సోలంకీ మెకానికల్ ఇంజనీర్. రాజ్ కోట్‌కు చెందిన కాంట్రాక్టర్, వ్యాపారవేత్త ఏకైక కుమార్తె రివా సోలంకీతో జడేజా వివాహం గతేడాది అత్తవారి స్టార్ హోటల్‌లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు
సోలంకీ గర్భవతి అన్న విషయం కూడా మార్చిలోనే అభిమానులకు తెలిసింది. ఛాంపియన్స్ టోర్నీకి మందు జడేజా ఓ ఛానెల్‌తో మాట్లాడాడు. 'ఛాంపియన్స్ ట్రోఫీ కోసం గర్భవతి అయిన నా భార్యను వదిలి వెళ్తున్నాను. ఈ టోర్నీకి నేనెంతో అవసరం. టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్ పాక్‌తో జరగనుంది. కుటుంబసభ్యులు ఆమెకు తోడుగా ఉంటారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు' అని అన్నాడు.

ఈ సందర్భంగా అభిమానులు జడేజాకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం జడేజా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు లండన్ చేరుకున్న భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. తన తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం సాధించింది. ఎడ్జిబాస్టన్ వేదికగా జూన్ 4(ఆదివారం) జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై 124 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో జడేజా 8 ఓవర్లు వేసి 2 వికెట్లు తీసి 43 పరుగులిచ్చాడు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గురువారం భారత్-శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఓవల్ వేదికగా మధ్యాహ్నాం 3 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇందులో గెలిస్తే టీమిండియా సెమీస్ కు చేరుతుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది.