
క్రైస్ట్‌చర్చ్: అనధికారిక మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్-ఏ జట్టుతో జరిగిన ఉత్కంఠ పోరులో భారత-ఏ జట్టు 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. కివీస్ నిర్దేశించిన 271 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. 49.4 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఐదు పరుగుల తేడాతో కివీస్ మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఈ ఓటమితో మూడు వన్డేల సిరీస్‌ను 1-2 తేడాతో భారత జట్టు కోల్పోయింది.
271 పరుగుల లక్ష్య చేధనలో టీమిండియా స్టార్ ఆటగాడు ఇషాన్ కిషన్ (84 బంతుల్లో 71; 8ఫోర్లు) చివరి వరకు క్రీజులో ఉన్నా.. జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. కిషన్‌కు తోడు పృథ్వీ షా (38 బంతుల్లో 55; 8ఫోర్లు, 1 సిక్సర్) హాఫ్ సెంచరీ సాధించగా.. రుతురాజ్ గైక్వాడ్ (44), అక్షర్‌పటేల్ (32)లు పర్వాలేదనిపించారు. అయితే సారథి మయాంక్ అగర్వాల్ (24)తో పాటు సూర్యకుమార్ యాదవ్ (5), విజయ్ శంకర్(19), కృనాల్ పాండ్యా (7)లు పూర్తిగా విఫలమయ్యారు. కివీస్ పేసర్ కైల్ జేమ్సన్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. అజాజ్ పటేల్ మూడు, రవీంద్ర రెండు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.
అంతకుముందు టాస్ ఓడి మొదటగా బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఆరంభంలో టీమిండియా బౌలర్లు చెలరేగారు. ఇషాన్ పోరెల్ ధాటికి కివీస్ ఓ క్రమంలో 105 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో మార్క్ చాప్‌మన్ (98 బంతుల్లో 110; 10 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీతో అదరగొట్టాడు. చాప్‌మన్‌కు తోడు లోయరార్డర్ బ్యాట్స్‌మన్ ఆస్టల్ (65 బంతుల్లో 56; 2ఫోర్లు, 1 సిక్సర్) ఆర్థ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
చాప్‌మన్, ఆస్టల్‌లు ఏడో వికెట్‌కు 136 పరుగులు నమోదు చేసారు. ఈ జోడీ టీమిండియా బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. కీలక సమయంలో ఇద్దరు రాణించడంతో కివీస్ కోలుకుంది. ఇషాన్ పోరెల్ మూడు వికెట్లు తీయగా.. రాహుల్ చహర్ రెండు, సందీప్ వారియర్, అక్షర్ పటేల్‌లు తలో వికెట్ వేసుకున్నారు. తొలి వన్డేలో గెలిచిన టీమిండియా.. తర్వాతి రెండు వన్డేల్లో ఓడిపోవడం గమనార్హం. రెండు అద్భుత విజయాలతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో కివీస్ కైవసం చేసుకుంది.