హైదరాబాద్: ముక్కోణపు వన్డే క్రికెట్ టోర్నీలో భాగంగా దక్షిణాఫ్రికా 'ఎ' జట్టుతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 'ఎ' జట్టు రెండు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 'ఎ' జట్టు 41.5 ఓవర్లలో కేవలం 152 పరుగులకే కుప్పకూలింది.
కెప్టెన్ మనీశ్ పాండే 95 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 55 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పరుగులు చేయడంలో మిగితా బ్యాట్స్‌మెన్ పూర్తిగా విఫలమయ్యారు. దక్షణాఫ్రికా పేసర్ డ్వెయిన్ ప్రెటోరియస్ ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

24 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. ఇక ఫాంగిసో (4/30), హెండ్రిక్స్ (2/15) భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బ తీశారు. అనంతరం 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 37.4 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించింది.
71 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన దక్షిణాఫ్రికా జట్టును బెహర్దీన్ (62 బంతుల్లో 37 నాటౌట్), ప్రెటోరియస్ ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 62 పరుగులు జోడించారు. ప్రెటోరియస్ అవుటైన తర్వాత మిగతా బ్యాట్స్‌మెన్ సహకారంతో బెహర్దీన్ దక్షిణాఫ్రికాకి విజయాన్ని అందించాడు.
ఇక, భారత బౌలర్లలో యజువేంద్ర చహల్ (3/41), అక్షర్ పటేల్ (35) రాణించగా... మొహమ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాకూర్, బాసిల్ థంపి తలో వికెట్ తీశారు. ఈ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో అఫ్ఘానిస్తాన్‌తో భారత్ 'ఎ' తలపడనుంది.