ఎమర్జింగ్ నేషన్స్ ఆసియా కప్‌లో భారత కుర్రాళ్లు అద్భుతంగా ఆడారు. బంగ్లాదేశ్-ఎతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో తడబడినా కూడా చివరకు విజయం సాధించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టుకు అనుకున్న ఆరంభం దక్కలేదు. సాయి సుదర్శన్ (21), అభిషేక్ శర్మ (34) ఫర్వాలేదనిపించారు.
అయితే ఆ తర్వాత వచ్చిన నికిన్ జోస్ (17), నిషాంతు సింధు (5), రియాన్ పరాగ్ (12), ధృవ్ జురెల్ (1), హర్షిత్ రాణా (9) పరుగులు మాత్రమే చేశారు. దీంతో భారత జట్టు కష్టాల్లో పడింది. ఇలాంటి సమయంలో కెప్టెన్ యష్ ధుల్ (66) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. ఆచితూచి ఆడుతూ జట్టు స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు.

ఈ క్రమంలో అతనికి మానవ్ సుతర్ (21), రాజ్‌వర్ధన్ హంగ్రేకర్ (15) నుంచి మంచి సహకారం లభించింది. ధుల్ పోరాటంతో భారత జట్టు 49.1 ఓవర్లలో 211 పరుగులు చేయగలిగింది. బంగ్లా ముందు ఓ మోస్తరు లక్ష్యాన్ని సెట్ చేసింది. లక్ష్య ఛేదనలో బంగ్లాకు మంచి ఆరంభమే లభించింది. ఓపెనర్లు మహమ్మద్ నైమ్ (38), తన్‌జీత్ హసన్ (51) రాణించారు. దీంతో బంగ్లా గెలిచేలా కనిపించింది.
ఇలాంటి సమయంలో భారత బౌలర్లు పుంజుకున్నారు. దీంతో ఆ తర్వాత వచ్చిన ఒక్క బంగ్లా బ్యాటర్ కూడా కనీసం 30 పరుగులు చేయలేకపోయారు. కెప్టెన్ సైఫ్ హసన్ (22), మహమ్మద్ హసన్ జాయ్ (20), మెహదీ హసన్ (12) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. దీంతో బంగ్లా జట్టు 34.2 ఓవర్లలో 160 పరుగులకే ఆలౌట్ అయింది. 50 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్.. ఫైనల్‌లో అడుగు పెట్టింది.
ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లలో నిషాంత్ సంధు ఐదు వికెట్లతో చెలరేగాడు. మానవ్ సుతర్ మూడు వికెట్లతో ఆకట్టుకోగా.. యువరాజ్ సింగ్ దోడియా, అభిషేక్ శర్మ చెరో వికెట్ తీసుకున్నారు. ఇక ఫైనల్‌లో భారత్-ఎ జట్టు మరోసారి పాకిస్తాన్‌తో తలపడనుంది.