
ఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, లెఫ్టినెంట్ కల్నల్ మహేంద్రసింగ్ ధోనీ క్రికెట్‌కు రెండు నెలల పాటు విశ్రాంతిని ఇచ్చి ప్రస్తుతం కశ్మీర్ లోయలో సైనిక విధుల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ రోజు 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. ధోనీ లద్దాఖ్‌లో పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్నాడు. లద్దాఖ్‌లో స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవడం కోసం ధోనీ బుధవారమే అక్కడికి చేరుకున్నాడు. వేడుకల్లో పాల్గొన్న అనంతరం ధోనీ లద్దాఖ్‌లోని ఆర్మీ ఆసుపత్రిని సందర్శించాడు. అక్కడి సిబ్బంది, సైనికులతో చాలా సమయం గడిపాడు.
ధోనీ ఈ రోజు సియాచిన్ బేస్‌ను కూడా సందర్శించనున్నారు. అంతేకాదు సియాచిన్ అమరవీరులకు నివాళులు అర్పించనున్నారని సమాచారం. స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలకు సంబందించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ధోనీ అభిమానులు వీటిని తెగ షేర్ చేస్తున్నారు. ధోనీ ప్రస్తుతం గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో పారాచూట్ రెజిమెంట్‌లో తన విధులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
'ధోనీ భారత ఆర్మీకి బ్రాండ్ అంబాసిడర్. ప్రస్తుతం అతను తన యూనిట్ సభ్యులను ప్రేరేపించడంలో నిమగ్నమయ్యాడు. అందరికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. యూనిట్ సభ్యులతో కలిసి ఫుట్‌బాల్, వాలీబాల్ ఆడుతున్నాడు. సైనిక బలగాలతో కలిసి ఆర్మీ విధుల్లో పాల్గొంటున్నాడు. అలాగే యుద్ధ శిక్షణా వ్యాయామాలు కూడా చేస్తున్నాడు' అని ఓ ఆర్మీ అధికారి పేర్కొన్నారు.
ధోనీ ఒకవైపు కశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తూ.. మరోవైపు విరామ సమయంలో తోటి సైనికులను అలరిస్తున్నాడు. తాజాగా బాలీవుడ్ 'బిగ్ బీ' అమితాబ్ బచ్చన్ నటించిన 'కభీ కభీ' సినిమాలోని 'మై పల్ దో పల్‌కా షాయర్ హు' నే పాటను పాడి తోటి సైనికులను అలరించాడు. విధి నిర్వహణలో ఉన్న ధోనీ తన షూస్‌ను తానే పాలిషింగ్ చేసుకుంటున్న ఓ ఫొటో కూడా రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతకుముందు విరామ సమయంలో అక్కడి ఆర్మీ సిబ్బందితో ధోనీ వాలీబాల్ ఆడాడు.