మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ మధ్య కొలంబోలోని ఆర్.ప్రేమదాస అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో భారత మహిళల జట్టు బ్యాటింగ్ ముగిసింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. దీంతో పాకిస్తాన్ ముందు 248 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. రిచా ఘోష్(20 బంతుల్లో 35) డెత్ ఓవర్లలో అందించిన మెరుపు బ్యాటింగ్ కారణంగా భారత్ ఈ స్కోరును సాధించగలిగింది.
పాకిస్తాన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకోగా, టీమిండియాకు ఓపెనర్లు మంచి ఆరంభం ఇచ్చారు. ఓపెనర్లు ప్రతికా రావల్, స్మృతి మంధాన తొలి వికెట్‌కు 48 పరుగులు జోడించి పటిష్టమైన పునాది వేశారు. స్మృతి మంధాన 32 బంతుల్లో 23 పరుగులు చేసి ఔట్ కాగా, ఆ వెంటనే ఓపెనర్ ప్రతికా రావల్ 37 బంతుల్లో 31 పరుగులు చేసి సాదియా ఇక్బాల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయింది.టాప్ ఆర్డర్ త్వరగా పెవిలియన్ చేరినప్పటికీ, హర్లీన్ డియోల్ నిలకడగా ఆడింది. ఆమె 65 బంతుల్లో 46 పరుగులు చేసి భారత ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచింది.

భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 34 బంతుల్లో కేవలం 19 పరుగులు మాత్రమే చేసి డయానా బైగ్ బౌలింగ్‌లో ఔట్ అయింది.రోడ్రిగ్స్ సహకారం: జెమీమా రోడ్రిగ్స్ 37 బంతుల్లో 32 పరుగులు చేసి విలువైన సహకారం అందించింది. చివర్లో స్నేహ్ రాణా 20 పరుగులు చేయగా, శ్రీ చరణి ఒక పరుగు మాత్రమే చేసింది. డెత్ ఓవర్లలో రిచా ఘోష్ దుమ్మురేపడంతో భారత జట్టుకు మంచి స్కోరు లభించింది.
మ్యాచ్‌కు అంతరాయం
భారత ఇన్నింగ్స్ సమయంలో మైదానంలో కీటకాల సమస్య తలెత్తడం వలన మ్యాచ్‌కు కొద్దిసేపు అంతరాయం కలిగింది. కీటకాలను తొలగించడానికి స్ప్రే కూడా వాడాల్సి వచ్చింది. దీనివల్ల ఇన్నింగ్స్ మధ్య విరామం కూడా తక్కువ సమయం మాత్రమే ఉంటుంది.
పాకిస్తాన్ బౌలింగ్
పాకిస్తాన్ బౌలర్లలో డయానా బైగ్ 4 వికెట్లు పడకొట్టగా.. ఫాతిమా సనా, సాదియా ఇఖ్బాల్ చెరో 2 వికెట్లు తీసి భారత స్కోరు వేగాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. రమీన్ షమీమ్, నష్రా సంధు తలో వికెట్ పడగొట్టారు. పాకిస్తాన్ జట్టుకు ఈ లక్ష్యం పెద్దదిగా కనిపిస్తున్నప్పటికీ, ఈ ఉత్కంఠభరిత పోరులో ఏం జరుగుతుందో చూడాలి.