T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026లో వెస్టిండీస్ జట్టుపై భారత్ ఘనవిజయం సాధించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ప్రస్తుతం ఎక్కడ చూసిన టీమిండియా స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ గురించే చర్చ నడుస్తోంది. అయితే ఈ భారీ విజయం వెనుక భారత బ్యాటింగ్ లైనప్‌లోని డొల్లతనం ఇప్పుడు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌లకు పెద్ద తలపోటుగా మారింది.
సంజూ వన్ మ్యాన్ షో.. మిగతా వారు ఫ్లాప్!
వెస్టిండీస్‌తో జరిగిన కీలక పోరులో సంజూ శాంసన్ 50 బంతుల్లో 97 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. కానీ స్కోరు కార్డును ఒక్కసారి గమనిస్తే షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. సంజూ శాంసన్ ఒక్కడే చేసిన పరుగుల కంటే, మిగిలిన బ్యాటర్లందరూ కలిసి చేసిన పరుగులు తక్కువగా ఉండటం గమనార్హం. మిగతా బ్యాటర్లు అభిషేక్ శర్మ (10), ఇషాన్ కిషన్ (10), సూర్యకుమార్ యాదవ్ (18), తిలక్ వర్మ (27), హార్దిక్ పాండ్యా (11), శివమ్ దూబే (8) మాత్రమే చేశారు. సంజూ శాంసన్ మినహా మిగిలిన ప్రధాన బ్యాటర్లందరూ కలిసి చేసిన పరుగులు కేవలం 84. ఇది సంజూ శాంసన్ చేసిన స్కోరు (97) కంటే 13 పరుగులు తక్కువ కావడం విశేషం.

మిడిలార్డర్ తడబాటు.. స్పిన్నర్ల ఉచ్చులో భారత బ్యాటర్లు
ఈ టోర్నీలో భారత బ్యాటింగ్ స్థిరంగా లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాపై 84 పరుగులు చేసిన తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాట్ నుంచి ఆశించిన స్థాయిలో పరుగులు రావడం లేదు. ముఖ్యంగా మధ్య ఓవర్లలో స్పిన్నర్లను ఎదుర్కోవడంలో భారత బ్యాటర్లు తడబడుతున్నారు. దక్షిణాఫ్రికాలో జరిగిన మ్యాచ్‌లోనూ భారత బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలడం ఇందుకు నిదర్శనం. యువ ఆటగాళ్లు అభిషేక్ శర్మ, తిలక్ వర్మ నిలకడ లేమితో ఇబ్బంది పడుతున్నారు.
సెమీఫైనల్‌కు ముందు సవాల్
మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్‌తో భారత్ సెమీఫైనల్ మ్యాచ్‌లో తలపడనుంది. బలమైన ఇంగ్లాండ్ బౌలింగ్‌ను ఎదుర్కోవాలంటే కేవలం ఒక్కరిపైనే ఆధారపడటం ప్రమాదకరమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. సెమీస్‌కు ముందు ఈ బ్యాటింగ్ లోపాలను సరిదిద్దుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.