
అహ్మదాబాద్: వెస్టిండీస్‌తో మూడో వన్డేలో టీమిండియా ఇన్నింగ్ పడుతూ లేస్తూ సాగుతోంది. 42 ఓవర్లకు ఆరు వికెట్లను కోల్పోయి, 207 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలిపోగా.. మిడిలార్డర్‌లో యంగ్ బ్యాటర్స్ రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ ఆదుకున్నారు. వారిద్దరూ అవుట్ అయిన తరువాత మళ్లీ వరుస వికెట్లు పడ్డాయి. ఒకరకంగా ఈ మ్యాచ్‌పై వెస్టిండీస్ బౌలర్లు ఆధిపత్యాన్ని ప్రదర్శించినట్టే. 16 పరుగులకే రెండు వికెట్లు, 42 పరుగుల వద్ద మూడో వికెట్ పడటం బౌలర్లు పైచేయి సాధించారనడానికి నిదర్శనం.
మిడిలార్డర్‌లో రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ ఇద్దరూ అర్ధసెంచరీలతో జట్టును ఆదుకున్నారు. ఇద్దరూ తమదైన ట్రేడ్ మార్క్ షాట్లతో చెలరేగిపోయారు. విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. రిషభ్ పంత్ 54 బంతుల్లో 56 పరుగులు చేశాడు. ఇందులో ఓ భారీ సిక్స్, ఆరు ఫోర్లు ఉన్నాయి. జట్టు స్కోరు 152 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. హెడెన్ వాల్ష్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ షైహోప్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
శ్రేయాస్ అయ్యార్‌దీ అదే దూకుడు. 111 బంతుల్లో తొమ్మిది బౌండరీలతో 80 పరుగులు చేశాడతను. వాల్ష్ బౌలింగ్‌లోనే డ్వేన్ బ్రావో పట్టిన క్యాచ్‌తో పెవిలియన్ చేరాడు. అతను అవుట్ అయ్యే సమయానికి జట్టు స్కోరు 187 పరుగులు. అల్జారీ జోసెఫ్, హెడెన్ వాల్ష్ రెండు చొప్పున, ఒడియన్ స్మిత్, ఫాబియన్ అలెన్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇన్నింగ్ కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో రిషభ్ పంత్ మరోసారి మెరిశాడు. అందరి దృష్టినీ ఆకర్షించాడు.
అతను ఆడిన చివరి ఏడు మ్యాచ్‌లల్లో ఇది నాలుగో హాఫ్ సెంచరీ. ఈ ఏడు మ్యాచ్‌లల్లో 310 పరుగులు చేశాడు. యావరేజ్ 44.28 శాతం. స్ట్రైక్ రేట్ ఏకంగా 136.56 శాతంగా నమోదైంది. చివరి ఏడు మ్యాచ్‌లల్లో 77, 78, 16, 85, 0, 11, 56 పరుగులు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్, 15వ ఎడిషన్ ప్రారంభం కావడానికి కొద్దిరోజుల ముందు ట్రాక్‌లో పడిందతని బ్యాటింగ్. ఐపీఎల్ ఫ్రాంఛైజీలు అతనిపై మరింత పెట్టుబడి పెట్టడానికి అవకాశాన్ని కల్పించినట్టయింది.